టిఆర్ఎస్ సీనియర్ నేత, మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో ఈడీ అధికారుల సోదాల వ్యవహారం తెలంగాణతో పాటు దేశ రాజకీయాల్లోనూ చర్చనీయాంశమైంది. కమలాకర్ ఇంటికి తాళం వేసి ఉన్న నేపథ్యంలో ఆ తాళం పగలగొట్టి మరీ ఈడీ అధికారులు దాడులు నిర్వహించడం సంచలనం రేపుతోంది. సోదాల కోసం వచ్చిన అధికారులు తాళం కోసం మంత్రిని, ఆయన బంధువులను సంప్రదించే ప్రయత్నం చేసినా స్పందనలేదని, ఆ క్రమంలోనే తాళం పగలగొట్టాల్సి వచ్చిందని తెలుస్తోంది. రాజకీయ నేతల విషయంలో ఈడీ ఇలా చేయడం తొలిసారని, దీంతో, గంగులకు షాక్ తగిలినట్లయిందని టాక్.
కరీంనగర్లో గ్రానైట్ వ్యాపారులు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఈడీ ఎనిమిది సంస్థలకు నోటీసులు జారీ చేసింది. అవన్నీ మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులు, వారికి అత్యంత సన్నిహితులకు చెందినవని తెలుస్తోంది. హైదరాబాద్ తో పాటు కరీంనగర్ లో మొత్తం 30 బృందాలు ఈ సోదాల్లో పాల్గొంటున్నట్టుగా తెలుస్తోంది. కరీంనగర్ మైనింగ్ వ్యవహారంలో దాదాపు 170 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి.
అక్రమ మైనింగ్ చేస్తూ ప్రభుత్వానికి రావాల్సిన వేల కోట్ల రూపాయల ఆదాయానికి గండి కొడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇక కమలాకర్ అక్రమ మైనింగ్ పై తాను రెండేళ్ల క్రితం విమర్శలు గుప్పించానని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. అయితే, గంగుల కమలాకర్ ఇంట్లో ఏ ఆధారాలు దొరికాయన్న దానిపై అధికారులు ఎటువంటి ప్రకటన చేయలేదు.
ఈ సోదాల నేపథ్యంలోనే దుబాయ్ బయలుదేరిన కమలాకర్ హుటాహుటిన హైదరాబాద్ కు తిరుగు పయనమయ్యారు. అయితే మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎపిసోడ్ నేపథ్యంలో బిజెపిని కేసీఆర్ ఇరకాటంలో పెట్టిన క్రమంలోనే తాజాగా కేంద్ర పెద్దలు ఈడీ సోదాలతో టీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేశారన్న టాక్ వస్తోంది.