టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, విలక్షణ దర్శకుడు పూరి జగన్నాథ్ ల కాంబినేషన్లో వచ్చిన లైగర్ చిత్రం భారీ డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన ఈ చిత్రం పూరి, విజయ్ ల కెరీర్ లోనే అతిపెద్ద ఫ్లాప్ గా నిలిచి నిరాశపరిచింది. ఈ సినిమాను బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ తో కలిసి నిర్మించిన పూరి జగన్నాథ్ భారీగా నష్టపోయాడు.
ఈ క్రమంలోనే తమ నష్టాలను భర్తీ చేయాలంటూ కొంతమంది బయ్యర్లు, ఎగ్జిబిటర్లు పూరి జగన్నాథ్ ను బెదిరించిన వైనం, ఆ తర్వాత ఇద్దరు బయ్యర్లపై పూరి జగన్నాథ్ కేసు పెట్టడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమాకు సంబంధించి పూరి జగన్నాథ్, ఛార్మి, విజయ్ లు మరో వివాదంలో చిక్కుకున్నారు. లైగర్ సినిమా తీసేందుకు హవాలా సొమ్మను ఉపయోగించారని ఆరోపణలు రావడం సంచలనం రేపుతోంది.
ఈ క్రమంలోనే ఈడీ విచారణకు హీరో విజయ్ దేవరకొండ హాజరు కావడం హాట్ టాపిక్ గా మారింది. లైగర్ సినిమా తీసేందుకు హవాలా సొమ్మును వాడినట్టుగా ఆరోపణలు రావడంతో ఈడి విచారణ చేపట్టింది. ఈ సినిమా నిర్మించేందుకు అవసరమైన డబ్బును దుబాయ్ కి పంపించి అక్కడి నుంచి పెట్టుబడుల రూపంలో తీసుకున్నట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఈ సినిమా నిర్మాణంతో సంబంధం ఉన్నవారిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
అంతేకాదు, ఈ సినిమా నిర్మాణానికి ఓ రాజకీయ నేత కూడా సాయం చేశారని, ఆ నేతకు ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధం ఉందని కూడా ఈడీ అధికారులు భావిస్తున్నారు. ఈడీ విచారణకు విజయ్ తో పాటు పూరి జగన్నాథ్, ఛార్మి కూడా హాజరయ్యారు.