ఢిల్లీ లిక్కర్ కుంభకోణం వ్యవహారం దేశ రాజకీయాలతో పాటు ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలోనూ సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆప్ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మెడకు చుట్టుకున్న ఈ స్కామ్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతోపాటు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, వైఎస్ భారతి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడి పేర్లు వినిపించడం షాకింగ్ గా మారింది. ఈ క్రమంలోనే సాయిరెడ్డిని సారాయి రెడ్డి అంటూ ప్రతిపక్ష నేతలు విమర్శలు కూడా గుప్పించారు.
ఈ క్రమంలోనే తాజాగా ఈ కుంభకోణం నేపథ్యంలో విజయసాయి రెడ్డికి ఈడీ అధికారులు షాకిచ్చారు. సాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి సోదరుడు శరత్ చంద్రా రెడ్డిని ఈడీ అధికారులు ఢిల్లీలో అరెస్టు చేశారు. ప్రముఖ ఫార్మా సంస్థ అరబిందో గ్రూపులోని 12 కంపెనీలకు డైరెక్టర్ గా ఉన్న శరత్ తోపాటు తెలంగాణకు చెందిన వ్యాపారవేత్త వినయ్ బాబును ఈడీ అధికారులు అరెస్టు చేసిన వైనం తీవ్ర చర్చనీయాంశమైంది.
అరబిందో గ్రూప్ నుకు చెందిన 2000 కోట్ల రూపాయల బ్లాక్ మనీని ఢిల్లీ లిక్కర్ లాబీలో పెట్టి వైట్ మనీగా మార్చినట్టుగా వారిద్దరిపై ఆరోపణలు వచ్చాయి. దీంతో, మూడు రోజులపాటు ఆ ఇద్దరినీ ఈడీ అధికారులు విచారణ జరిపిన అనంతరం నేడు అరెస్టు చేశారు. వీరికి కోట్ల రూపాయల విలువైన మద్యం వ్యాపారాలున్నాయని, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈఎండీలు చెల్లించినట్లుగా శరత్ పై అభియగాలున్నాయని అధికారులు చెబుతున్నారు.
మరోవైపు, ఈ స్కామ్ లో సీఎం జగన్ సతీమణి వైయస్ భారతి పేరు కూడా వినిపించిన సంగతి తెలిసిందే. శరత్ అరెస్టు నేపథ్యంలో ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు కీలక నేతల పేర్లు కూడా వెల్లడయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి సన్నిహితుడిగా పేరున్న వ్యాపారవేత్త రామచంద్ర పిళ్ళైను, ఎమ్మెల్సీ కవిత పీఏను ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.