మిగిలిన వాటితో పోలిస్తే కాలం చాలా పవర్ ఫుల్. అందుకే అంటారు.. అనునిత్యం అప్రమత్తంగా ఉండటంతో పాటు.. కీలక స్థానాల్లో ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు.. వ్యవహరించే తీరు తర్వాతి కాలంలో క్యారీ అవుతుందని. ఇప్పుడు అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు కేటీఆర్. ఢిల్లీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు.
ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్న వేళలో.. మాజీ మంత్రులు కం కవిత సోదరుడు, మేనబావ లైన కేటీఆర్.. హరీశ్ రావులు ఆఫీసర్లు ఉన్న గదిలోకి వెళ్లారు. ఈ తీరును అక్కడే ఉన్న ఐఆర్ఎస్ అధికారిణి.. ఈడీ డైరెక్టర్ గా వ్యవహరించే భానుప్రియ మీనా అభ్యంతరం వ్యక్తం చేశారు. సెర్చ్ పూర్తైందని.. అరెస్టు వారెంట్ ఇష్యూ అయ్యాక ఇంట్లోకి ఎందుకు రాకూడదంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా వాగ్వాదానికి దిగారు.
ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో కాసేపటికే బయటకు వచ్చి.. వైరల్ గా మారింది. ఈ వీడియో ఎవరు బయట పెట్టారన్నది ప్రశ్నగా మారింది.అయితే.. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈడీ అధికారిణితో కేటీఆర్ వాగ్వాదానికి దిగటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న పదేళ్లలో (తొమ్మిదిన్నరేళ్లలో) ఎంతోమందిని అరెస్టు చేశారని.. ఈ సందర్భంగా కేటీఆర్ చెబుతున్న నిబంధనల్ని పాటించారా? అని ప్రశ్నిస్తున్నారు.
రేవంత్ రెడ్డి.. కోదండరాం.. బండి సంజయ్ తో పాటు మరెందరో ముఖ్యనేతల్ని అరెస్టు చేసే వేళలో ఎలాంటి తీరును ప్రదర్శించారో మర్చిపోయారా? అన్నదిప్పుడు చర్చగా మారింది. అప్పుడు లాపాయింట్లు ఎందుకు గుర్తుకు రాలేదు? ఇప్పుడు కేటీఆర్ వాదనలో పస ఏమిటన్నది కూడా సందేహమేనని చెబుతున్నారు. అధికారులు తనిఖీలు పూర్తి చేసిన తర్వాత.. బలమైనరాజకీయ నేపథ్యం ఉన్న నేతలు అధికారులున్న గదిలోకి రావటం.. అది కూడా వారి అనుమతి లేకుండా అన్నది వారి రక్షణకు సంబంధించిన అంశంగా చెబుతున్నారు.
తాము అధికారంలో ఉన్నప్పుడు పలువురు నేతల్ని అదుపులోకి తీసుకున్నప్పుడు అర్థరాత్రి వేళలోనూ.. ఇంటి తలుపులు బద్ధలు కొట్టి మరీ తీసుకెళ్లటం.. వారెంట్ ఏదని అడిగినప్పుడు ఎలాంటి సమాధానం చెప్పకుండానే దురుసుగా వ్యవహరించిన నాటి పోలీసుల తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాము పవర్లో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన కేటీఆర్.. ఇప్పుడు మాత్రం రూల్ బుక్ గురించి మాట్లాడటమా? అని ప్రశ్నిస్తున్నారు. నిబంధనల్ని ఎవరైనా పాటించాల్సిందే. కాకుంటే.. కేటీఆర్ తీరు సరిగా లేదంటున్నారు.
పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపిన వారు.. ఏ టైంలో ఎలా వ్యవహరించాలో ఆ మాత్రం తెలీదా? అన్నది ప్రశ్న. తాము పవర్లో ఉన్నప్పుడు ఎంతో మంది ప్రముఖుల అరెస్టు జరిగాయి. ఆ సందర్భంగా అనుసరించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ ఎప్పుడు కూడా వాటికి వివరణ ఇచ్చింది లేదు. అలాంటప్పుడు తనిఖీలు జరుగుతున్న గదిలోకి అనుమతి తీసుకోకుండా రావటం.. అధికారులతో వాగ్వాదానికి దిగిన వైనం సరికాదంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే కవిత అరెస్టు వేళ రావాల్సిన సానుభూతి.. కేటీఆర్ ఆగ్రహం.. వాగ్వాదం నెగిటివ్ గా మారిందన్న మాట వినిపిస్తోంది. కాస్తంత సంయమనంతో వ్యవహరిస్తే బాగుండేదన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.