దేశాన్ని కుదిపేస్తోన్న ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు నేడు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. కవితతోపాటు ఆమె భర్త అనిల్ కూడా ఈడీ ఆఫీస్ దగ్గరకు వెళ్లారు. కవితకు ధైర్యం చెప్పి విచారణకు పంపించారు. ఇక, ఈడీ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలోని ఐదుగురు అధికారుల బృందం కవితపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. కవిత విచారణ సందర్భంగా ఈడీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు.
ఈ రోజు కవితతోపాటు పిళ్లైను కూడా విచారణ జరిపారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పాత్ర, నిందితులతో సంబంధాలు, ఇండో స్పిరిట్స్ కంపెనీలో వాటాలు,100 కోట్ల ముడుపుల వ్యవహారంపై గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, ఈ కేసులో కవితతోపాటు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన తనయుడు రాఘవల పేర్లు కూడా బలంగా వినిపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆల్రెడీ రాఘవను కొద్ది రోజుల క్రితం ఈడీ అధికారులు విచారణ జరిపారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా మాగుంట శ్రీనివాసులు రెడ్డికి కూడా తాజాగా ఈడీ నోటీసులు జారీ చేయడం సంచలనం రేపుతోంది. మార్చి 21 విచారణకు రావాలంటూ మాగుంటకు అందజేసిన నోటీసుల్లో ఈడీ పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్న ఈడీ..మాగుంటను ఆ ఆ కోణంలోనే విచారణ జరపబోతున్నారట. ఇక, ఇటీవలే మాగుంట రాఘవను ఈడీ అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా..ఆయన కస్టడీని ఈ నెల 28 వరకు పొడిగించింది న్యాయస్థానం. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ రాఘవ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా..దానిపై ఈ నెల 23న సీబీఐ స్పెషల్ కోర్టులో విచారణ జరగనుంది.