ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం అయితే.. సిద్ధమవుతోంది. పార్టీలు తమ తమ రాజకీయాలను ముమ్మరం చేస్తున్నాయి. అభ్యర్తులను ఖరారు చేస్తున్నాయి. అయితే.. కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా.. నోటిఫికేషన్‌ను విడుదల చేయలేదు. వచ్చే నెల రెంఓ వారం.. లేదా మూడో వారంలో నోటిఫికేషన్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. కానీ, ఇంతలోనే కేంద్ర ఎన్నికల సంఘం పని ప్రారంభించేసింది. ఏపీలో ఇటీవల పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు..ఇక్కడ పరిస్థితులు తెలుసుకున్నారు.
ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయని.. దొంగ ఓట్ల నమోదు కార్యక్ర మం నిరంతరాయంగా జరుగుతోందని ప్రతిపక్ష టీడీపీ సహా.. బీజేపీ చేసిన ఫిర్యాదులను సీఈసీ పరిగణన లోకి తీసుకుంది. ఈ క్రమంలో ఇప్పటికే కొందరు అధికారులకు హెచ్చరికలు కూడా చేసింది. ఇదిలావుంటే.. తాజాగా అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీష్‌ను కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. దీనికి 2021 ప్రారంభంలో జరిగిన తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలే కారణంగా కనిపిస్తోంది.
వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో అప్పట్లో ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఎన్నికల్లో ఎపిక్ కార్డులను అక్రమంగా డౌన్ లోడ్ చేశారని, వాటిని మార్ఫింగ్ చేశారని, దొంగ ఓట్లు వేసేందుకు ఆవకాశం కల్పించార ని.. అప్పట్లో ప్రధాన ప్రతిపక్షాలుగా ఉన్న టీడీపీ, బీజేపీ లు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశాయి. దీనిపై అప్పట్లోనే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు కూడా చేశాయి. అయితే.. ఈ విషయాన్ని అప్పటి నుంచి పక్కన పెట్టిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఇటీవల విజయవాడ పర్యటనలో అధికారులను ఈ విషయంపై నిలదీసింది.
ఈ క్రమంలో అప్పట్లో తిరుపతి కమిషనర్, ప్రస్తుతం కలెక్టర్‌గా ఉన్న గిరీష్‌ను బాధ్యుడిన చేస్తూ.. తాజాగా ఎన్నికల సంఘం ఆయనను సస్పెండ్ చేసింది. అప్పటి కమిషనర్‌గా ఉన్న గిరీష్ ఏకంగా తన ఐడీని ఓ రాజకీయ పార్టీ నేతకు చెప్పేశారని.. తద్వారా.. ఎపిక్ కార్డులను డౌన్లోడ్ చేసుకున్నారని.. ఈసీ గుర్తించి.. ఈ మేరకు ఆయనపై కఠిన చర్యలు తీసుకుంది. వచ్చే ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ సస్పెన్షన్ ఆర్డర్ కొనసాగే అవకాశం ఉంది. ఇదిలావుంటే.. ఇంకా నోటిఫికేషన్ కూడా విడుదల కాకుండానే ఎన్నికల సంఘం తన పని ప్రారంభించడంతో అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మరి ఇప్పటికైనా.. తమపై వస్తున్న ఆరోపణలను వారు సరిచేసుకుంటారో లేదో చూడాలి.