ఏపీలో పోలింగ్ నాడు, పోలింగ్ ముగిసిన మూడు రోజుల తర్వాత కూడా పల్నాడు జిల్లా, తాడిపత్రి, తిరుపతి, పలు ప్రాంతాల్లో హింస చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోేనే హింసను ఆపడంలో విఫలమైన పోలీసు అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది. ఈ రోజు ఏపీ సీఎస్, డీజీపీల నుంచి వివరణ తీసుకున్న ఈసీ …ఈ హింసాత్మక ఘటనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పల్నాడు, తిరుపతి, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, గుంటూరు, నంద్యాల జిల్లాల్లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో పలువురు పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులపై వేటు వేసింది.
ఈ క్రమంలోనే పల్నాడు జిల్లా కలెక్టర్, తిరుపతి ఎస్పీలపై బదిలీ వేటు వేసింది. పల్నాడు, అనంతపురం జిల్లాల ఎస్పీలను కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. తాడిపత్రి డీఎస్పీ గంగయ్య, సీఐ మురళీకృష్ణలపై ఈసీ సస్పెన్షన్ వేటు వేసింది. ఈ దాడుల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసమైనట్టు నివేదిక అందిందన్న ఈసీ..పలువురు స్థానిక అధికారులు నిర్లక్ష్యం వహించినట్లు సీఎస్, డీజీపీ వెల్లడించారని తెలిపింది. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలలోని 12 మంది సబార్డినేట్ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
హింసాత్మక ఘటనలపై ప్రతి కేసును ప్రత్యేకంగా తీసుకోవాలని, ప్రతి కేసుపై సిట్ వేసి రెండ్రోజుల్లో నివేదిక అందించాలని ఆదేశించింది. అంతేకాకుండా, హింసాత్మక ఘటనలు జరిగిన చోట 25 కంపెనీల సాయుధ బలగాలను కొనసాగించాలని కేంద్ర హోంశాఖకు నిర్దేశించింది. జూన్ 4న ఎన్నికల లెక్కింపు పూర్తయిన 15 రోజుల తర్వాత కూడా బలగాలు కొనసాగించాలని ఎన్నికల సంఘం తన ఆదేశాల్లో వివరించింది.