తెలంగాణ అధికార యంత్రాంగంపై రాష్ట్ర రాజకీయ పార్టీల్లో సదభిప్రాయం లేదు. వారంతా సీఎం కేసీఆర్ అడుగులకు మడుగులొత్తుతున్నారని నెత్తీనోరూ కొట్టుకున్నా అధికారుల్లో స్పందన లేదు. బీ(టీ)ఆర్ఎస్ నేతల కంటే మిన్నగా కేసీఆర్ ప్రభుత్వాన్ని వారు వెనకేసుకొస్తుంటారు. ఫక్తు రాజకీయ నేతల్లా వ్యవహరిస్తుంటారు. పదేళ్లుగా జరుగుతున్న తంతు ఇదే. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మరీ అన్యాయంగా వ్యవహరించారు. టీఆర్ఎస్కు అనుకూలంగా ఓటింగ్ చేయించడంలో అధికారులు, పోలీసులు పోటీలు పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఉప ఎన్నికల్లో సైతం వారి పక్షపాత ధోరణి బయటపడింది. టీఆర్ఎస్ నేతలు విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ చేసినా చూడీచూడనట్లు వ్యవహరించారు. ఇప్పుడు మళ్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వీటన్నిటినీ కేంద్ర ఎన్నికల కమిషన్ తాజాగా బయటకు తీసింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి కొద్ది రోజుల ముందు ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్ నేతృత్వంలో 17 మంది ఈసీ బృందం తెలంగాణకు వచ్చింది. ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్ర అధికారులు సమర్పించిన నివేదికలపై సమీక్ష జరిపింది. ఓటర్ల జాబితా, ఎన్నికల ఏర్పాట్లు, అనుకూల, ప్రతికూల పరిస్థితులు, ఎన్నికల వేళ నిఘాపై ఆరా తీసింది.
మద్యం, డబ్బు అక్రమ రవాణా కట్టడి, చెక్‌పోస్టుల ఏర్పాటుపై పోలీసు విభాగాలతో చర్చించారు. ఓట్ల తొలగింపు, కొత్త ఓటర్ల నమోదు, ఫిర్యాదులు, గత అనుభవాలపై జిల్లా ఎన్నికల అధికారులకు సూచనలు చేశారు. అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించే గుర్తుల అంశంపై కూడా చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాజీవ్‌కుమార్ చాలా కటువుగా మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో పక్షపాత ధోరణితో వ్యవహరించవద్దని.. గతంలో జరిగిన ఎన్నికల్లో వ్యవహరించిన తీరుపై తమకు పలు ఫిర్యాదులు అందాయన్నారు. గత ఎన్నికల్లో చేపట్టిన చర్యలు, పట్టుబడ్డ నగదు, మద్యం, ఇతర అంశాలకు సంబంధించి రాష్ట్రం ఇచ్చిన నివేదికలు చూస్తే బాధ కలుగుతోందని సీఈసీ బృందం అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఆయా సందర్భాల్లో చోటుచేసుకున్న సంఘటనలను పరిశీలిస్తే.. రాష్ట్రంలోని అధికారుల పనితీరు ఏ మాత్రం బాగోలేదని స్పష్టం చేసింది. ముఖ్యంగా మూడు జిల్లాలకు చెందిన కనఫర్డ్ ఐఏఎ్‌సల వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉప ఎన్నికలు, ఇతర ఎన్నికల సందర్భాల్లో డబ్బు పంపిణీ, మద్యం సరఫరా విచ్చలవిడిగా జరిగినప్పటికీ.. ఆయా జిల్లాల్లో అధికార యంత్రాంగం చూసీ చూడనట్లుగా వ్యవహరించినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి ఓటింగ్, పోలింగ్ ప్రక్రియ పూర్తయి.. ఫలితాలు ప్రకటించే వరకు ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగాలని, ఇందుకోసం జిల్లాల అధికారులు బాధ్యతగా పనిచేయాలని ఆదేశించింది.
దీని ఫలితంగానే షెడ్యూల్ విడుదల అయిన మరుక్షణమే తెలంగాణలో చాలా చోట్ల నగదు పట్టుబడింది. అటు ఈసీ కూడా తీవ్ర చర్యలకు ఉపక్రమించింది. పనితీరు సంతృప్తికరంగా లేదంటూ హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ సహా ముగ్గురు పోలీసు కమిషనర్లు, నాలుగు జిల్లాల కలెక్టర్లు, 10 జిల్లాల ఎస్పీలను బదిలీ చేసింది. రవాణా శాఖ కార్యదర్శి, ఎక్సైజ్ డైరెక్టర్, వాణిజ్య పన్నుల కమిషనర్‌నూ పక్కన పెట్టింది. బదిలీ అయిన వారు తక్షణం తమ తదుపరి స్థానాల్లో ఉన్నవారికి బాధ్యతలు అప్పగించి విధుల నుంచి వైదొలగాలని నిర్దేశించింది.
ఖాళీ అయిన స్థానాల్లో కొత్త అధికారుల పేర్లను కూడా ఖరారుచేసింది. బదిలీ అయినవారిలో వరంగల్, నిజామాబాద్ పోలీస్ కమిషనర్లు రంగనాథ్, సత్యనారాయణ.. రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, యాదాద్రి-భువనగిరి, నిర్మల్ జిల్లాల కలెక్టర్లు ఎస్.హరీశ, డి.అమోయ్ కుమార్, టి.వినయ్‌కృష్ణారెడ్డి, వరుణ్‌రెడ్డి కూడా ఉన్నారు. ఏకంగా పది మంది ఐపీఎస్‌లను బదిలీ చేయడం కూడా కేసీఆర్ ప్రభుత్వానికి మింగుడుపడడం లేదు.
ఫిర్యాదుల నేపథ్యంలోనే..
ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన ఈసీ అధికారులకు రాజకీయ పార్టీల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అధికార బీఆర్ఎస్కు కొందరు అధికారులు వంతపాడుతున్నారని, అలాంటి వారిని బదిలీ చేయాలని కాంగ్రెస్ కోరింది. ఏకంగా సీఎస్ శాంతికుమార్, డీజీపీ అంజనీకుమార్, కేసీఆర్‌కు సన్నిహితులైన ఉన్నతాధికారులు అర్వింద్‌కుమార్, జయేశ రంజన, రజతకుమార్, నవీన మిట్టల్, స్మితా సబర్వాల్, ఈవీ నర్సింహారెడ్డి, నాన-ఐఏఎ్‌స అధికారులైన గడల శ్రీనివాసరావు, కె.రమేశరెడ్డి, బోయినపల్లి మనోహర్‌రావులను తప్పించాలని అభ్యర్థించింది. మియాపూర్ భూకుంభకోణంలో సీఎస్ శాంతికుమారి పాత్ర ఉందని ఆరోపించింది.
ఆమె ఆరోగ్య శాఖ కార్యదర్శిగా ఉన్నప్పుడు గడల శ్రీనివాసరావుపై వచ్చిన నేషనల్ హెల్త్ మిషన నిధుల దుర్వినియోగ ఆరోపణలను ఎత్తివేశారని తెలిపింది. డీజీపీ అంజనీకుమార్ ఏపీ కేడర్‌కు చెందిన అధికారి అని, న్యాయ వ్యవస్థను ఏమార్చి డీజీపీ పోస్టును పట్టుకుని వేలాడుతున్నారని ఆరోపించింది. మనోహర్‌రావుపై కూడా కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా మసలుకుంటాడన్న ఆరోపణలు ఉన్నాయని తెలిపింది. రానున్న ఎన్నికల్లో మళ్లీ గెలవాలన్న తహతహతో అధికార బీఆర్ఎస్ పార్టీ అధికారాలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించింది.
ముఖ్యంగా తనకు సహకరించే అధికారులను బదిలీ చేయకుండా ప్రస్తుతం కొనసాగుతున్న పోస్టుల్లోనే ఉంచుతోందని తెలిపింది. ఇలాంటి అధికారులు ప్రతిపక్ష పార్టీలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు, కార్యకర్తలపై క్రిమినల్ కేసులు పెట్టిస్తూ రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని విమర్శించింది. కేంద్ర విజిలెన్స కమిషన, కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీఓపీటీ) నియమ నిబంధనలను తోసిరాజని ఒకే పోస్టులో 5 నుంచి 7 ఏళ్ల వరకు కొనసాగుతున్నారని తెలిపింది. ఇలా దీర్ఘకాలికంగా ఒకే పోస్టులో ఉంటూ ఎన్నికల్లో అధికార బీఆర్‌ఎ్‌సకు దోహదపడేలా ఒక నెట్వర్క్ తయారుచేసుకున్నారని ఆరోపించింది.
ఇలాంటి అధికారులను బదిలీ చేసి, నాన-ఫోకల్ పాయింట్లలో నియమించి, రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా, న్యాయబద్ధంగా జరిగేలా చూడాలని కోరింది. రాష్ట్ర బీజేపీ నేతలు కూడా కొందరు అధికారులపై ఫిర్యాదు చేశారు. ఈ విధంగా పార్టీల ఫిర్యాదులు, తమ సొంత పరిశీలన దరిమిలా ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఒకేసారి ఇంత మంది ఉన్నతాధికారులను బదిలీ చేయాలంటూ ఈసీ ఆదేశించడం అధికార బీఆర్ఎస్ పార్టీకి భారీ కుదుపేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎన్నికల ప్రక్రియ ఊపందుకున్నాక ఇంకొంత మందిపై వేటుపడవచ్చని అభిప్రాయపడుతున్నారు.