వైసీపీ హయాంలో ఆంధ్రుల రాజధాని అమరావతి ని జగన్ అటకెక్కించిన సంగతి తెలిసిందే. అమరావతిపై వైసీపీ నేతలతో పదేపదే దుష్ప్రచారం చేయించి…అమరావి నిర్మాణ పనులను అర్ధాంతరంగా జగన్ నిలిపివేశారు. అయితే, ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. మార్చి 15 నుంచి నిర్మాణ పనులు పున:ప్రారంభం కాబోతున్న సమయంలో అనుకోకుండా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో, అమరావతి పనులకు బ్రేక్ పడినట్లయింది. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం తాజాగా తీపి కబురు చెప్పింది.
అమరావతిలో నిర్మాణ పనులకు అభ్యంతరం లేదని, టెండర్లు పిలవవచ్చని తెలిపింది. అయితే, టెండర్లను మాత్రం ఖరారు చేయవద్దని ఆదేశించింది. దీంతో, టెండర్లు వేసేందుకు పలు కంపెనీలు రెడీగా ఉన్నాయని తెలుస్తోంది. మొత్తం రూ.40వేల కోట్ల విలువైన 62 పనులకు ఒకేసారి ఏపీ సర్కార్ శ్రీకారం చుట్టనుంది. ఆ పనుల కోసం సీఆర్డీఏ, ఏడీసీ టెండర్లు పిలిచింది. వాటితోపాటు మరో 11 పనులకు కూడా సీఆర్డీఏ అధికారులు టెండర్లు పిలిచే యోచనలో ఉన్నారు.
ఏప్రిల్ మొదటి వారం నుంచి అమరావతిలో 30 వేల మంది కార్మికులు పనులు చేసేందుకు రెడీ అవుతున్నారు. కేంద్ర బడ్జెట్లో అమరావతి పనులకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిధులు కూడా కేటాయించారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎప్పటికప్పుడు కేంద్రంతో చర్చలు జరిపి అమరావతి, పోలవరం ప్రాజెక్టుకు నిధులు మంజూరయ్యేలా చూస్తున్నారు.