ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ తన ఓఎస్డీగా (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) యువ ఐఏఎస్ అధికారి మైలవరపు వీఆర్ కృష్ణతేజను నియమించాలనుకున్నారు. ఈ ప్రతిపాదనకు సీఎం చంద్రబాబు ప్రత్యేక అనుమతినిచ్చారు. దీంతో, ప్రస్తుతం కేరళలోని త్రిసూర్ కలెక్టర్‌గా పనిచేస్తున్న కృష్ణతేజ..పవన్ ఓఎస్డీగా నియమితులైనట్లు అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి.
మామూలుగా అయితే ఆర్డీఓ స్థాయి అధికారులను మంత్రులకు ఓఎస్డీలుగా నియమిస్తారు. పవన్ కోసం ఐఏఎస్ అధికారి అయిన కృష్ణ తేజ నియామకానికి సీఎం చంద్రబాబు ప్రత్యేక అనుమతి ఇవ్వడం విశేషం. డిప్యుటేషన్‌పై ఏపీకి పంపాలని కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు లేఖ రాశారు.
పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన కృష్ణతేజ గతంలో కేరళ పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ, పర్యాటకశాఖ డైరెక్టర్, ఎస్సీ అభివృద్ధిశాఖ డైరెక్టర్, అలప్పుజ జిల్లా కలెక్టర్‌గా సేవలందించి కేరళ ప్రజల మన్ననలు పొందారు. త్రిసూర్ జిల్లా కలెక్టర్‌గా కృష్ణతేజ అందించిన సేవలకు గాను జాతీయ బాలల రక్షణ కమిషన్ ఆయనను పురస్కారానికి ఎంపిక చేసింది. బాలల హక్కుల రక్షణలో త్రిసూర్ జిల్లాను దేశంలోనే అగ్రగామిగా నిలిపారు. 2015 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఆయిన కృష్ణతేజ.. 2023లో మార్చిలో కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు.
ఐఏఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆయన అద్భుత పనితీరుతో తనదైన ముద్ర వేస్తున్నారు. అందుకే, పవన్ ఆయనను ఏరికోరి ఎంపిక చేసుకున్నారు. గత ప్రభుత్వంలో తనకు అనుకూలమైన ఐఏఎస్, ఐపీఎస్ లను తెప్పించుకున్న జగన్ కు…నిజాయితీపరులైన అధికారి కావాలని తెప్పించుకున్న పవన్ కు తేడా ఇది అంటూ సోషల్ మీడియాలో జనసైనికులు పోస్టులు పెడుతున్నారు.
మరోవైపు, అటవీ సంపద పరిరక్షణ కోసం ప్రత్యేక రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని అధికారులను పవన్ కల్యాణ్ ఆదేశించారు. మడ అడవుల పరిరక్షణకు ప్రాధాన్యతనివ్వాలని, వాటిని ధ్వంసం చేసే వారిని ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. ఉపాధి హామీ నిధులు దుర్వినియోగం కాకుండా పక్కాగా పరిరక్షించాలని, గ్రామాల్లో మరింత విస్తృతంగా అభివృద్ధి జరిగేలా ఈ పథకం వినియోగించుకోవాలని సూచించారు.