జగన్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటున్న వైసీపీ నేతలకు వరుసగా షాకులు తగులుతున్న సంగతి తెలిసిందే. వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్లిన ప్రతి చోటా వారికి నిరసన సెగలు తగులుతూనే ఉన్నాయి. చాలా చోట్ల వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులను మహిళ లు సైతం నిలదీస్తున్న వైనం అధికార పార్టీకి ఇరకాటంగా మారింది. జనం గడప తొక్కుతున్న వైసీపీ ఎమ్మెల్యేలకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కు డ్వాక్రా మహిళ ఒకరు షాకిచ్చారు. అవంతి అడిగిన ప్రశ్నకు ఆ మహిళ ఇచ్చిన సమాధానంతో మాజీ అమాత్యులు ఖంగుతిన్నారు. విశాఖ జిల్లా పద్మనాభం మండలం మద్దా గ్రామంలో ప్రభుత్వ నిధులతో నిర్మించిన సామాజిక భవనాలను అవంతి ప్రారంభించారు. సున్నా వడ్డీ మాఫీ చేస్తానని గతంలో చంద్రబాబు చెప్పారని, ఆయన మాఫీ చేశారా? అని చంద్రబాబును కార్నర్ చేసేలా ఒక డ్వాక్రా మహిళను అవంతి ప్రశ్నించారు.
చేయలేదు…అని ఆమె సమాధానం చెబుతుందని ఆశించిన అవంతి భంగపడ్డారు. చంద్రబాబు రుణ మాఫీ చేశారని ఆమె చెప్పడంతో అవంతి గాలి పోయింది. ఆ తర్వాత, చంద్రబాబు రుణ మాఫీ చేయలేదు సార్ అంటూ పక్కనే ఉన్న సంబంధిత అధికారిణి కవర్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో, ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి…సభకు వచ్చే డ్వాక్రా మహిళలకు సరిగ్గా ట్రైనింగ్ ఇచ్చి తీసుకురావాలంటూ మెల్లగా గొణుక్కున్న వైనం చర్చనీయాంశమైంది.
ఇక, ప్రస్తుత రాజకీయాలు చాలా మారిపోయాయని, రాజకీయ నేతలు లక్షలు, కోట్లు ఖర్చు చేస్తున్నారని అన్నారు. అంతేకాదు, పైసా ఆశించకుండా రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాల ద్వారా ఎంతోకొంత సంపాదించాలని అధికారులు కూడా ఆశపడతారని, కానీ, ఇప్పుడు వారి నోరు కూడా ఎండిపోతోందని అవంతి బాధపడిన వైనం హాట్ టాపిక్ గా మారింది.