గతంలో అయితే రాజకీయ నాయకుల సభలకు జనం స్వచ్ఛందంగా తరలి వచ్చేవారు. కానీ, గత దశాబ్ద కాలంగా ట్రెండ్ మారింది. తమ సభలు నిండుకుండలా జనంతో కళకళలాడాలన్న ఉద్దేశంతో రాజకీయ నేతలు డబ్బులు ఇచ్చి మరి జనాన్ని సభలకు పిలిపించుకుంటున్నారు. అలా డబ్బులు తీసుకొని సభలకు వచ్చిన మంద బలాన్ని చూపి తమకు భారీగా ప్రజా మద్దతు ఉందని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే, ఈ మధ్యకాలంలో డబ్బులు ఇచ్చినా జనం సభలకు రావడం మానేశారని మరో కొత్త ట్రెండుకు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు శ్రీకారం చుట్టాయి. సీఎం జగన్ సభకు డ్వాక్రా మహిళలు హాజరు కావాలని, లేకుంటే వారికి ఫైన్ వేస్తామని గతంలో ఆరోపణలు వచ్చాయి. అదే తరహాలో తాజాగా తెలంగాణలో సీఎం కేసీఆర్ సభకు హాజరుకాని డ్వాక్రా మహిళలకు ఫైన్ వేస్తామని బెదిరించినట్లుగా ఆరోపణలు రావడం కలకలం రేపింది.
ఈ నెల 25న రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ వస్తున్నారని, కేసీఆర్ సభకు డ్వాక్రా మహిళలందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ఒక మెసేజ్ వాట్సాప్ లో చక్కర్లు కొట్టిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంతేకాదు, కేసీఆర్ సభకు హాజరుకాని వారికి భవిష్యత్తులో లోన్లు ఇవ్వబోమని, వారికి 500 రూపాయలు ఫైన్ వేస్తామని కూడా మెసేజ్ లు వచ్చాయట. కేసీఆర్ కు స్వాగతం పలికేందుకు ఉదయం 11 గంటలకల్లా డ్వాక్రా మహిళలంతా మున్సిపల్ ఆఫీసు దగ్గరికి రావాలని హుకుం జారీ అయిందట.
అలా రాని వాళ్ళ పేర్లు నమోదు చేసుకుంటామని, వారికి ఫైన్ వేస్తామని కూడా ఆ సందేశంలో ఉన్నట్టుగా డ్వాక్రా మహిళలు చెబుతున్నారు. దాంతోపాటే, ఆ సభకు రాని వారికి ఎన్నికల సమయంలో డబ్బులు కూడా ఇవ్వబోమని చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక, కేసీఆర్ సభకు హాజరు కాలేకపోయినా కొందరు మహిళలైతే తమ గ్రూప్ లీడర్లకు రూ.500 ఫైన్ కూడా కట్టినట్టుగా పుకార్లు వినిపిస్తున్నాయి. దీంతో, ఈ వ్యవహారంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
Comments 1