తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం చేయాల్సిన పని లేని పేరుగా మారింది ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. ఆయనకు ఆయన భార్యకు.. మరో మహిళ మాధురికి మధ్యనున్న పంచాయితీ గురించి రోజుల తరబడి కోట్లాది మంది పాలో కావటం.. సినిమాటిక్ మలుపులతో సాగిన రియల్ సీరియల్ ఈ మధ్యన నెమ్మదించటం తెలిసిందే. అనూహ్యంగా కొత్త అప్డేట్ తో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
దువ్వాడ శ్రీనివాస్ కుటుంబంలో చోటు చేసుకున్న కలహాలకు ప్రధాన కారణమైన మాధురి విషయంలో దువ్వాడ మరోసారి దొరికిపోయారు. దీనికి సంబంధించిన ఆడియో లీక్ ఒకటి బయటకు వచ్చింది. ఆగస్టు 11న శ్రీనివాస్ కు సన్నిహితురాలైన దివ్వెల మాధురి కారు పలాస లక్ష్మీపురం టోల్ ప్లాజా వద్ద ప్రమాదానికి గురి కావటం.. మానసిక ఒత్తిడి.. వాణి కారణంగానే తాను సూసైడ్ కు ప్రయత్నించినట్లుగా ఆమె పేర్కొనటం తెలిసిందే.
అయితే.. ఆసక్తికరంగా ఈ సీన్ కు ముందు జరిగిన మరో సీన్ వెలుగు చూసింది. మనస్తాపంతో తన కారును మరో వాహనంతో గుద్దేసి.. ఆసుపత్రికి అంబులెన్స్ లో వెళుతున్న వేళ.. మాధురికి ఫోన్ చేసిన దువ్వాడ శ్రీనివాస్.. ఆమె బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఇక్కడితో కాల్ ముగిస్తే.. ఈ వార్త రాయాల్సిన అవసరం వచ్చేది కాదు. ఇక్కడే దువ్వాడ అడ్డంగా బుక్ అయ్యారు.
‘‘కావాలనే కారుతో ఢీ కొట్టి సూసైడ్ చేసుకోవాలనుకున్నా.. నాలుగు రోజులుగా వాణి ఆరాచకాలతో సూసైడ్ చేసుకోవటానికి ప్రయత్నించినట్లు మీడియాకు చెప్పు’’ అంటూ ఉచిత సలహా ఇవ్వటమే కాదు.. చివర్లో డాక్టర్లను.. పోలీసులతో వ్యవహారాన్ని నేను చూసుకుంటానుగా అంటూ ఆమెకు అభయమిచ్చిన వైనానికి సంబంధించిన ఫోన్ కాల్ ఆడియో తాజాగా లీకైంది. ఇదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాల్ చేసే వేళలో.. మాధురి ఫోన్ లో కానీ.. తన ఫోన్ లో కానీ కాల్ రికార్డు అయ్యే సౌకర్యాన్ని బంద్ చేసుకోవాలి కదా? ఇన్ని ప్లాన్లు వేసే దువ్వాడ.. ఇలాంటి వాటిని తీసేయాలన్న చిన్న లాజిక్ ను ఎందుకు మిస్ అయినట్లు?