తెలంగాణలో త్వరలో జరగనున్న దుబ్బాక ఉప ఎన్నిక ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. అధికార పార్టీకి చెందిన సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. టీఆర్ఎస్ పార్టీ బలం తగ్గిందన్న సంకేతాల్ని ఇచ్చేందుకు ఈ ఉప ఎన్నిక సాయమవుతుందని విపక్షాలు భావిస్తున్నాయి. అందుకే.. ఉప ఎన్నికల బరిలో బలమైన నేతనను నిలపాలని కాంగ్రెస్ యోచిస్తోంది.
గతానికి భిన్నంగా ఈ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. గతానికి భిన్నంగా.. పార్టీకి చెందిన పలువురు సీనియర్ల అభిప్రాయాన్ని తీసుకున్న అధినాయకత్వం.. ఎట్టకేలకు పార్టీ అభ్యర్థిగా సిద్ధిపేట డీసీసీ అధ్యక్షుడు టి. నర్సారెడ్డిని ఖరారు చేసినట్లుగా చెబుతున్నారు.
అధికారికంగా వెల్లడి కానప్పటికీ.. అధిష్ఠానంతో ఆమోదముద్ర వేయించుకొని ఈ నెల ఏడున ఆయన పేరును అధికారికంగా ప్రకటిస్తారని చెబుతున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎంపిక చేయటం కోసం భారీ కసరత్తునే చేపట్టింది. అభ్యర్థిగా ఎవరిని నిలపాలన్న అంశంపై జరిగిన చర్చల్లో శ్రావణ్ కుమార్.. కోమటిరెడ్డి పేర్లు కూడా వచ్చాయి.
అయితే..ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ముఖ్యనేతలు దామోదర రాజ నర్సింహా.. గీతారెడ్డి.. జగ్గారెడ్డి.. సురేశ్ షెట్కార్.. రేవంత్ రెడ్డి.. కుసుమ కుమార్.. పొన్నం ప్రభాకర్ తదితరనేతల అభిప్రాయాన్ని తీసుకున్న కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్.. చివరకు నర్సారెడ్డి పేరును ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. అందరి నోట ఆయన పేరే రావటంతో.. ఆయన్నే అభ్యర్థిగా నిలపటం మంచిదని భావిస్తున్నారు.
పార్టీ నేతల అందరి అభిప్రాయాన్ని సేకరించిన మాణిక్యం ఠాగూర్.. తాజాగా ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్ర స్థాయిలో తాము తీసుకున్న నిర్ణయాన్ని పార్టీ అధిష్ఠానానికి చెప్పి.. ఓకే చేయించాలని భావిస్తున్నారు. అక్కడ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే.. తమ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించనున్నారు.