త్వరలో జరగనున్న దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించి రాజకీయ పార్టీలు ఎంత హుషారుగా ఉన్నాయో తాజా ఉదంతం చెప్పకనే చెప్పేస్తుంది. శామీర్ పేట టోల్ గేట్ వద్ద సోమవారం రాత్రి పోలీసులకు పట్టుబడ్డ రూ.40లక్షలకు సంబంధించిన లెక్క బయటకు వచ్చింది. తాజాగా బాలానగర్ డీసీపీ పద్మజారెడ్డి మాట్లాడుతూ.. సదరు రూ.40లక్షలు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుదేనని తేల్చారు. ఉప ఎన్నికల కోసమే ఆ డబ్బును తరలిస్తున్నట్లుగా చెప్పారు.
దీంతో.. ఎన్నికల వేళ.. బీజేపీ అడ్డంగా బుక్ అయినట్లైంది. ఉప ఎన్నికల్లో భారీగా నోట్ల కట్టలు తెగనున్నాయన్న అంచనాలకు తగ్గట్లే.. భారీగా పట్టుబడ్డ మొత్తం ఉందని చెప్పక తప్పదు. శామీర్ పేట టోల్ గేట్ వద్ద పోలీసులు వాహనాల్ని చెక్ చేస్తున్నారు. రింగ్ రోడ్డు పైన రెండు కార్లలో వస్తున్న వారు.. పోలీసుల్ని చూసి వెనక్కి వెళ్లే ప్రయత్నం చేశారు.
దీన్ని గుర్తించిన పోలీసులు ఆ వాహనాల్ని వెంబడించారు. ఈ సందర్భంగా కారులో నుంచి ఒక వ్యక్తి పెద్ద సంచితో పారిపోయే ప్రయత్నం చేయగా పోలీసులు పట్టుకున్నారు. అతడ్ని విచారించగా పొంతన లేని సమాధానాలు ఇచ్చారు. సంచిని చెక్ చేస్తే రూ.40లక్షలుగా తేలాయి. ఇంత భారీ మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందని అడిగితే.. సరైన సమాధానాలు రాలేదు. దీంతో.. విచారించిన పోలీసులకు.. ఈ మొత్తం బీజేపీ అభ్యర్థి రఘునందన్ కు చెందినదిగా తేలింది.కొందరికి ఈ మొత్తాన్ని ఇచ్చి రావాలని పంపారని పోలీసులకు పట్టుబడ్డ వారు చెప్పారు. ఉప ఎన్నికల్లో దూకుడుగా వ్యవహరిద్దామని భావించిన కమలనాథులకు.. తాజా ఎదురుదెబ్బ వారి స్పీడ్ కు బ్రేకులు వేస్తుందని చెప్పక తప్పదు.