మందుబాబులం మేము మందు బాబులం…మందుకొడితే మాకు మేమే మగారాజులం….అంటూ కరోనాకాలంలోనూ మందుబాబులు వైన్ షాపుల ముందు క్యూ కడుతున్నారు. గుక్కెడు చుక్క కోసం బార్ల ముందు బార్లా పడుతున్నారు. అంతేకాదు, క్వార్టర్ వేస్తే చాలు కరోనా కాదు కరీనా వచ్చినా మమ్మల్నేమీ చేయదన్న ధీమాలో బ్రతికేస్తున్నారు చాలామంది మందుబాబులు.
ఈ నేపథ్యంలోనే ఆ తరహా భ్రమలో ఉన్న మందుబాబులందరీకి పలువురు వైద్య నిపుణులు కిక్కు దిగిపోయే వార్త చెప్పారు. మద్యం, ధూమపానం అలవాట్లున్న వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని, వారు పొరపాటున కరోనా బారినపడితే కోలుకోవడం కష్టమేనని చావుకబురు చల్లగా చెప్పారు. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్), భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) నిర్వహించిన సంయుక్త వెబినార్లో పలువురు వైద్య నిపుణులు ఈ విషయాన్ని వెల్లడించారు.
మద్యం, పొగ తాగే వారు కరోనాతో మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సాధారణ వ్యక్తులతో పోలిస్తే మందుబాబులకు కోవిడ్-19 రిస్క్ ఎక్కువని చెబుతున్నారు. మద్యం సేవించేవారు, ధూమపానం చేసేవారు ఈ మహమ్మారి బారినపడితే కోలుకోవడం కష్టమని అంటున్నారు. అంతేకాదు, వీరిలో మరణాల రేటు కూడా అధికంగా ఉంటోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి, వీరి మాటలను మందుబాబులు చెవికెక్కించుకుంటారా…లేక పెడచెవిన పెట్టి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారా అన్నది వారే తేల్చుకోవాలి మరి.