ఏపీ సీఎం జగన్ పదే పదే చెబుతున్న మూడు రాజధానుల్లో.. కర్నూలు న్యాయ రాజధాని. దీనిని ఎంతో అభి వృద్ధి చేస్తామని.. గతానికి భిన్నంగా ఇక్కడి ప్రజలకు అన్నీ ఏర్పాటు చేస్తామని.. సీఎం జగన్ చెబు తున్నారు. అంతేకాదు.. ఇక్కడి ప్రజాప్రతినిధులు కూడా కర్నూలును అద్భుతంగా తీర్చిదిద్దుతామని.. రాగాలు తీస్తున్నారు. అయితే.. రాజధాని మాట దేవుడెరుగు కానీ.. ఇక్కడి పరిస్థితి మాత్రం దారుణంగా తయారైంది. రైతు రాజ్యంలో ఇక్కడ.. అన్నదాతలు.. లబోదిబో మంటున్నారు. న్యాయరాజధాని కాదు.. ముందు మాకు న్యాయం చేయాలని..ఇక్కడి రైతులు కోరుతున్నారు.
దీనికి కారణం.. మళ్లీ కరువు రక్కసి జిల్లాపై పంజా విసరడమే. కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతం నుంచి మళ్లీ వలసలు మొదలయ్యాయి. ఈ ఏడాది ఆశించిన వర్షాలు కురవకపోవడంతో స్థానికంగా సాగు పనులు లేకుండా పోయాయి. అరకొరగా వేసిన పత్తి, మిరప పంటలకు తెగుళ్లు సోకి రైతులు అప్పుల పాలయ్యారు. ఉన్న ఊరిలో కూలి దొరక్క, ఉపాధి హామీ పనులకు వెళ్లినా.. బిల్లులు రాక సతమతమవు తున్నారు. కోసిగి మండల కేంద్రంలోని 2, 3, 4వ వార్డులకు చెందిన 3 వేల మందికిపైగా ఇరవై వాహనాల్లో కర్ణాటకలోని యాదగిరి జిల్లాకు వలసపోయారు.
ఇక్కడ చిత్రం ఏంటంటే.. వలస పోయింది ఒక్క సాధారణ ప్రజలే కాదు.. ప్రభుత్వం నియమించుకున్న వలంటీర్ కుటుంబాలు కూడా వలస బాటపట్టాయి. ప్రస్తుతం అక్కడ పత్తి తీత పనులు జోరుగా సాగుతు న్నాయని, పెద్దలకు రూ.400, చిన్నారులకు రూ.200 దాకా కూలీ దొరుకుతుందని చెప్పారు. అయితే.. పనులు లభించడం లేదు. దీంతో కొందరు గ్రామ వాలంటీర్లు సైతం తమ కుటుంబాలతో కలిసి వలసబాట పట్టడం కరవుకు అద్దం పడుతోంది. కర్నూలు జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచీ ఈ సీజన్లో దాదాపు రెండు లక్షల మంది కర్ణాటక, తెలంగాణకు వలస వెళ్లిపోవడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.
వాస్తవానికి.. ఉపాధి హామీ పనులు ప్రవేశ పెట్టింది వీరి కోసమే. పనులు దొరకని సమయంలో.. ఉపాధి పథ కం ద్వారా గ్రామాల్లో పనులు కల్పించి.. పొట్టనింపే ఉద్దేశంతోనే కేంద్రం దీనిని తీసుకువచ్చింది. అయితే.. ఉపాధి పనులు.. చేపట్టినప్పటికీ.. కేంద్రం నుంచి నిధులు వచ్చినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం వాటిని విడుదల చేయడం లేదు. దీంతో ఉపాధి పనులకు వెళ్లినా.. కూలీ అందక.. పొట్ట నిండక.. ఇల్లు గడవక.. కుంటుంబాలకు కుటుంబాలే వలస బాటపట్టాయి. మరి న్యాయ రాజధానిలో జరుగుతున్న ఈ అన్యాయమైన ఘటనపై సీఎం ఎలా స్పందిస్తారో చూడాలి.