మిస్టరీగా మారిన దివంగత వైసీపీ నేత, ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి బాబాయి వివేకానందరెడ్డి హత్యపై కేరళకు చెందిన హక్కుల కార్యకర్త జోమున్ పుతెన్ పురక్కల్ తెలుగు మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకానందరెడ్డి హత్య విషయంలో పలు అనుమానాలున్నాయని అన్నారు. ఇందులో చాలా పెద్ద కుట్ర దాగి ఉందని సంచలన వ్యాఖ్యాలు చేశారు. సీబీఐ చేతికి వెళ్లిన ఈ కేసులో ఇప్పటికీ సరైన పురోగతి కనిపించకపోవడం వెనుక తెలుగు ప్రజలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.
ఇంతకీ ఆయనెందుకు మాట్లాడారో తెలుసా…. వివేకా కూతురు సునీతారెడ్డి ఆయనను కలిసిందట. 3 రోజుల క్రితం వివేక కుమార్తె సునీతారెడ్డి తనను కలిసిందని, తండ్రి హత్య గురించి చర్చించారని జోమున్ వెల్లడించడం సంచలనం అయ్యింది. హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐకి సాక్ష్యాధారాల సేకరణలో ఎలా సాయం చేయాలన్న దానిపై చర్చించినట్టు చెప్పారు. వివకానందరెడ్డిని హత్య చేసిన నిందితులకు తప్పకుండా కఠిన శిక్ష పడేలా చేస్తామని ఆయన హెచ్చరించారు.
జోమున్ ఎవరో కాదు… సిస్టర్ అభయ పై రేప్, హత్య కేసులో తీవ్రంగా పోరాడి పాతికేళ్ల తర్వాత కూడా నిందితులను వదలకుండా శిక్ష వేయించారు. సిస్టర్ అభయ కేసులో తీర్పు వచ్చిన తర్వాత జోమున్ పేరు హైలెట్ అయింది.
ఆయన ఏమన్నారంటే… అనుమానితుల గురించి ఇప్పుడే మాట్లాడడం సరికాదు. 2 నెలల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అన్ని విషయాలు వెల్లడిస్తానని, తన వద్ద ఉన్న సాక్ష్యాలను బయటపెడతానని చెప్పారు.