ప్రముఖ వైద్యులు, ఎన్నారై, ‘తానా’ వ్యవస్థాపక అధ్యక్షులు కాకర్ల సుబ్బారావు తుదిశ్వాస విడిచారు. నెల రోజుల క్రితం అనారోగ్యానికి గురై కిమ్స్ ఆస్పత్రిలో చేరిన సుబ్బారావు చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందారు. 1986లో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ‘నందమూరి తారక రామారావు’ ప్రవాస ఆంధ్రులకు ఇచ్చిన పిలుపు మేరకు కాకర్ల సుబ్బారావు స్వదేశానికి తిరిగి వచ్చి హైదరాబాద్ నిమ్స్‌లో కీలక బాధ్యతలు చేపట్టి నిమ్స్ లో అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలు అందేలా కృషి చేశారు.
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా( ‘తానా’) తొలి అధ్యక్షుడిగా సేవలందించిన సుబ్బారావుతో చాలామంది ఎన్నారైలకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ క్రమంలోనే సుబ్బారావు మృతిపట్ల ‘తానా’ మాజీ అధ్యక్షులు, ప్రముఖ ఎన్నారై ‘జయరాం కోమటి ‘ సంతాపం వ్యక్తం చేశారు. సుబ్బారావుతో తనకున్న అనుబంధాన్ని ‘జయరాం కోమటి ‘ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
ఎన్నారైలతోపాటు స్వదేశంలోని తెలుగువారి కోసం సుబ్బారావు చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. అమెరికా తెలుగు సంఘాలలో సానుకూల దృక్పధం రావాలని ,కష్టపడే తత్వం పెరగాలని చెపుతూ ఉండేవారని గుర్తు చేసుకొన్నారు. తనలాంటి వారెందరికో సుబ్బారావు మార్గదర్శి అని, ఆయన అడుగుజాడల్లో నడిచి ‘తానా’ ను ఉన్నత శిఖరాలకు చేర్చడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. వైద్యరంగంలో విశేష సేవలందించిన సుబ్బారావు మృతి ఎన్నారైలతోపాటు తెలుగువారందరికీ తీరని లోటు అని అన్నారు. సుబ్బారావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానని ‘జయరాం కోమటి ‘ చెప్పారు.