ప్రపంచ వ్యాప్తంగా 5జీ టెక్నాలజీ ఓ కొత్త సాంకేతిక విప్లవానికి నాంది పలికిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ ప్రపంచంలో కొన్ని దేశాలకు పరిచయమైన ఈ 5జీ టెక్నాలజీ త్వరలో భారత్ లోనూ అందుబాటులోకి రానుంది. మొట్టమొదటగా ప్రపంచానికి 5జీని పరిచయం చేసింది వెరైజన్ కంపెనీ అన్న సంగతి తెలిసిందే. కానీ ఈ 5జీ టెక్నాలజీని డెవలప్ చేసిన డెవలప్మెంట్ టీంలో మన తెలుగింటి ఆడపడుచు కీలక పాత్ర పోషించారన్న సంగతి అతి కొద్ది మందికే తెలుసు.
5జీని ప్రపంచానికి పరిచయం చేసిన వెరైజన్ ఆర్కిటెక్ట్ లలో ‘డాక్టర్ కళ్యాణి బోగినేని’ ఒకరు.
ఆ కంపెనీలో ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా, ప్రతి సంవత్సరం వారి కంపెనీ నుంచి ఇచ్చే ప్రతిష్టాత్మక వెరైజన్ `మాస్టర్ ఇన్వెంటర్` అవార్డును 2021 సంవత్సరానికిగాను ఆమెకు ప్రకటించారు.
అమెరికాలోని నెట్వర్క్ టెక్నాలజీ రంగంలో ఈ తరహా అవార్డులు మహిళలకు రావడం చాలా అరుదు. చాలా మంది తెలుగు మహిళలు, భారతీయ మహిళలు పలు సాఫ్ట్ వేర్ కంపెనీలలో రాణిస్తున్నప్పటికీ, నెట్వర్క్ టెక్నాలజీ రంగంలో ఇటువంటి అవార్డు రావడం గర్వ కారణం.
అందుకే, శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పూర్వ విద్యార్థిని అయిన డాక్టర్ కళ్యాణి ని ఆమె సహచరులు, అధ్యాపకులు వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభినందించారు.
డాక్టర్ కళ్యాణి, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్‌లో 1982లో బీటెక్(ఈఈఈ) విద్యను పూర్తి చేశారు. అదే విధంగా 1984లో ఐఐఎస్సీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో ఎంఈ పూర్తి చేశారు. డార్ట్ మౌత్ కాలేజీ నుంచి ఫెలోషిప్ అందుకున్నారు. 1990లో ఇంజనీరింగ్ సైన్సెస్‌లో డార్ట్ మౌత్ నుంచి ఎం.ఎస్ పట్టా అందుకున్నారు. 1993లో స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ ఎట్ బఫెలో నుంచి ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో పీహెచ్డీ పూర్తి చేశారు. పీహెచ్డీ సమయంలో 20కి పైగా IEEE/ACM పత్రాలను సమర్పించారు.
వెరైజన్ లో నెట్వర్క్స్ అండ్ టెక్నాలజీ స్ట్రాటజీ అండ్ ప్లానింగ్‌లో 18 ఏళ్లుగా సేవలు అందిస్తున్నారు. తను చేసే పనిలో వ్యూహాత్మకంగా ఆలోచించడంతోపాటు సృజనాత్మకతకు పెద్దపీట వేస్తారు. నాయకత్వ లక్షణాలను పుణికి పుచ్చుకున్న ఆమె మంచి వక్త గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. సాంకేతిక రంగం లోను, మల్టీ కంప్యూటర్ ఆర్కిటెక్చర్, ఆప్టికల్ మరియు వైర్లెస్ విభాగాల్లో ఆమె అనుభవం ఎంతో దోహద పడింది.
2 జీ నుంచి 5 జీ వరకు వైర్లెస్ నెట్ వర్క్ డిజైనింగ్‌లోనూ అద్భుతమైన ప్రగతి చూపించారు. వర్చ్యువలైజేషన్, సాఫ్ట్వేర్ ఆధారిత నెట్వర్కింగ్, కృత్రిమ మేథ, ఆటోమేషన్ వంటి విభాగాల్లో సత్తా చాటారు. IEEEలో సీనియర్ సభ్యురాలే కాకుండా, సాంకేతిక కమిటీల్లోనూ పాలు పంచుకుంటున్నారు. అదేవిధంగా పారిశ్రమిక సదస్సుల్లోను, జర్నల్స్‌లోనూ, ఆమె అనేక విషయాలను పంచుకున్నారు. పారిశ్రామిక అవసరాలకు తగిన విధంగా అనేక సూచనలు చేశారు.
IEEE/ACM పబ్లికేషన్స్‌లో ఇప్పటి వరకు దాదాపు 30 ఆర్టికల్స్ రాశారు. అదే విధంగా 70 పేటెంట్స్ ని సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా వాయిస్ ఓవర్ ఐపీ, 4జీ, 5జీ టెక్నాలజీలలో అద్భుత ప్రతిభ కనబరిచారు. IEEE టెక్నలాజికల్ ఇన్నోవేషన్ అవార్డు-2019 తో సహా డాక్టర్ కళ్యాణి, తన ఉద్యోగ జీవితంలో అనేక అవార్డులను అందుకున్నారు.
అమెరికాలోని తెలుగు వారంతా డాక్టర్ కళ్యాణి ని అభినందిస్తున్నారు.