బతుకు-బతికించు అనే నినాదం అన్ని రంగాలకు వర్తిస్తుంది. తాను ఉన్నత స్థితిలో ఉండడమేకాకుండా.. తన తోటివారు కూడా ఉన్నత స్థితిలో ఉండాలని ఆలోచించే వ్యక్తులు చాలా తక్కువ మంది ఉన్న నేటి సమాజంలో పొరుగు వారికి సాయపడాలనే ప్రధాన సత్సంకల్పంతో అడుగులు వేస్తున్నారు ప్రవాసాంధ్రులు ‘డాక్టర్ గోరంట్ల వాసుబాబు’. వ్యక్తి జీవితాన్ని సమున్నత స్థాయికి తీసుకువెళ్లే కీలకమైన విద్యారంగంలో ఆయన ఇతోధిక సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రధానంగా బడుగు, బలహీన వర్గాలకు విద్యను అందించే ప్రభుత్వ పాఠశాలలకు ‘డాక్టర్ గోరంట్ల వాసుబాబు’ చేస్తున్న సాయం అనిర్వచనీయమనే చెప్పాలి.
ఉన్నత విద్యను అభ్యసించి, స్థిరపడిన ‘డాక్టర్ గోరంట్ల వాసుబాబు‘.. తాను పుట్టిన గడ్డకు ఏదో ఒక రూపంలో సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే.. ఏ రంగంలో సాయం చేసినా.. అది అప్పటితో అయిపోయింది. అదే విద్యారంగంలో కనుక చేస్తే.. కొన్ని తరాల వరకు ప్రయోజనం చేకూరుతుంది. సమాజానికి ఇది మరింత మేలు చేస్తుంది. దీనిని దృష్టిలో పెట్టుకున్న డాక్టర్ వాసుబాబు.. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించేందుకు, బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్య అందించేందుకు అన్ని విధాలా తోడ్పడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉపయోగపడే ప్రయోజనకరమైన సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నారు.
ప్రకాశం జిల్లా పర్చూరు మండలం వీరన్నపాలెం గ్రామానికి చెందిన ‘డాక్టర్ గోరంట్ల వాసుబాబు’.. గడిచిన నాలుగేళ్లుగా అనేక ప్రభుత్వ పాఠశాలలకు ఆర్థిక సాయం చేస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్నం, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కడప, కర్నూలు, తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాల్లోని జిల్లా పరిషత్, మండల పరిషత్, ఎయిడెడ్ పాఠశాలలకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు ఉపకరించేలా సైన్స్ ప్రయోగశాలలు, డిజిటల్ తరగతులు బోధించేలా మెరుగైన సౌకర్యాల కల్పన, బోధనా సామాగ్రి అందజేత వంటి కార్యక్రమాలకు ఇతోధిక సాయం అందిస్తున్నారు.
ఇలా.. మొత్తం 10 జిల్లాల్లోని 202 పాఠలల్లో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు ఇప్పటి వరకు దాదాపు 90 లక్షల రూపాయలు వెచ్చించారు. తద్వారా పేద వర్గాలకు చెందిన విద్యార్థులు సమున్నత విద్యను అభ్యసించడంతోపాటు.. సమాజానికి ఉత్తమ పౌరులు అందేలా ఆయన కృషి చేస్తున్నారు.
ఎన్టీఆర్ స్ఫూర్తితో..
టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత ముఖ్యమంత్రి ‘ఎన్టీఆర్’ స్ఫూర్తితో ‘డాక్టర్ గోరంట్ల వాసుబాబు’ సమాజ హితమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. విద్యార్థి దశలోనే ఆంధ్రా విశ్వవిద్యాలయంలో టీడీపీలో చురకైన పాత్ర పోషించారు. విద్యార్థి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి.. వాటిని పరిష్కరించేందుకు విశేష కృషి చేశారు. పర్చూరు మండలంలోని వీరన్నపాలెం, ఇనగల్లు పాఠశాలల్లో ప్రాథమిక పూర్తి చేసుకున్న వాసుబాబు.. పర్చూరులోని యార్లగడ్డ రామన్న ఉన్నత పాఠశాలలోను, ఇంటర్ మీడియెట్ను కారంచేడులోని వైవీసీఆర్సీఎస్పీ జూనియర్ కాలేజీలోనూ పూర్తి చేశారు. తర్వాత విశాఖలోని ఆంధ్రాయూనివర్సిటీ, ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్(బీఈ), ఎంటెక్, పీహెచ్డీ పూర్తి చేశారు. అయితే… ‘ఎన్టీఆర్ ‘పై ఉన్న అభిమానంతో తన పీహెచ్డీ(డాక్టర్ పట్టా)ని 1994, మే 28న ‘ఎన్టీఆర్ ‘పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయనకే అంకితం ఇచ్చారు.
ఇంతింతై.. అన్నట్టుగా ఎదిగి..
‘డాక్టర్ గోరంట్ల వాసుబాబు’.. తన విద్యా జీవితంలో ఇంతింతై.. అన్న విధంగా ఎదిఆరు. సివిల్ ఇంజనీరింగ్లో సుమారు 100కుపైగా పరిశోధన పత్రాలు సమర్పించారు. అనేక జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో పాఠ్యాంశాలకు తోడు ప్రయోగ శాలల ద్వారా విద్య మరింత పుంజుకుంటుందని గుర్తించారు. 1984లో ఎన్టీఆర్ చెప్పిన ఇదే విషయాన్ని ఆయన స్ఫూర్తిగా తీసుకుని తదనంతర కాలంలో ఆయన ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యావృద్ధికి తన వంతు సాయం అందిస్తూ వచ్చారు.
తాను పడ్డ కష్టాలు.. పేద విద్యార్థులు పడరాదనే..
విద్యార్థి దశలో ఉన్నప్పుడు ‘డాక్టర్ వాసుబాబు’ పడ్డ అనేక కష్టాలు.. నేటి తరం పేద విద్యార్థులు పడరాదని నిర్ణయించుకున్న ఆయన గతంలో తాను ఎదుర్కొన్న సమస్యలు ఇప్పటికి రాకుండా ఉండాలనే ఉద్దేశంతో డిజిటల్ విద్యావిధానానికి, ల్యాబుల ఏర్పాటు కు ప్రాధాన్యం ఇస్తున్నారు. మరీముఖ్యంగా చారిత్రక, స్వాతంత్య్ర యోధులకు సంబంధించిన జీవిత చరిత్రలు, వారి చిత్రపటాలను కూడా నేటి తరం విద్యార్థులకు చేరువ చేసి.. వారిలో స్ఫూర్తి నింపే కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
భాషా పరిజ్ఞానంపై ..
సమాజంలోనే కాకుండా దేశం, అంతర్జాతీయంగా కూడా విద్యార్థులు రాణించాలంటే.. వారికి వివిధ భాషలపై పట్టు ఉండాలనే విషయాన్ని గ్రహించిన ‘డాక్టర్ వాసుబాబు’.. తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలను పేద విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో చేరువ చేసేందుకు విశేష కృషి చేస్తున్నారు. ఆయా భాషలను సులువుగా విద్యార్థులకు బోధించేందుకు వీలుగా బోధనా సామగ్రిని అందిస్తున్నారు.
లక్షాధికారి కాకున్నా.. ఒక లక్ష్యం పెట్టుకుని!
పొరుగు వాడికి సాయం చేయాలన్న మనసు ముందు లక్షాధికారే కానవసరం లేదని అంటారు ‘డాక్టర్ వాసుబాబు’. తాను సంపాయించుకున్న దానిలో అంతో ఇంతో పొరుగువారికి కేటాయించడం ద్వారా సమాజానికి ఎంతో మేలు చేసే అవకాశం ఉందని ఆయన చేతల ద్వారా నిరూపిస్తున్నారు. ఈ క్రమంలో పాఠశాలలకు ఆయన ఇప్పటి వరకు రూ.90 లక్షలు విరాళంగా అందజేసి.. మౌలిక సదుపాయాలు కల్పించారు. అంతేకాదు, తాను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివానన్న కృతజ్ఞతను అణువణువునా నింపుకొన్న వాసుబాబులో.. అదే పాఠశాలల్లో చదువుకునే పేద వర్గాలకు చెందిన విద్యార్థులకు మరింతగా సాయం అందించాలనే తపన స్పష్టంగా కనిపిస్తుంది. కుల, మత, ప్రాంతాతీతమైన పాఠశాలల ద్వారా సమాజానికి ఎంతో మేలు చేయొచ్చనేది ‘డాక్టర్ వాసుబాబు’. దృక్ఫథం. ఈ ఆలోచనతోనే ఆయన అడుగులు వేస్తున్నారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల ఉన్నతికి పాటుపడుతున్నారు.