ఏపీ అసెంబ్లీలో శుక్రవారం చోటు చేసుకున్న పరిణామాలు.. టీడీపీ అధినేత కమ్ వియ్యంకుడు కమ్ బావ చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకోవటం.. తన సోదరి భువనేశ్వరిపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై తాజాగా నందమూరి బాలక్రిష్ణ స్పందించారు.
హైదరాబాద్ లోని తన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టిన ఆయన.. తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అసెంబ్లీలో జరిగిన పరిణామాలు చాలా బాధాకరమని.. సజావుగా సాగాల్సిన అసెంబ్లీ వ్యక్తిగత దూషణలకు వేదికగా మారిందన్నారు. డెవలప్ మెంట్ మీద చర్చకు బదులుగా వ్యక్తిగత అజెండాను తీసుకొచ్చారన్నారు.
ప్రజల తరఫున.. పార్టీ తరఫున.. నా అభిమానుల తరఫున ఇదే నా హెచ్చరిక అన్న బాలయ్య.. ‘మళ్లీ ఇలాంటి నీచపు మాట్లాడితే ఊరుకునేది లేదు. ఈ వ్యాఖ్యల్ని సహించం. ఖబడ్డార్.. భరతం పడతాం.. ప్రతి విషయానికి హద్దు ఉండాలి. చంద్రబాబు చాలా ధైర్యంగా ఉండే మనిషి. ఎప్పుడూ ఆయన కంటతడి పెట్టలేదు. అసెంబ్లీలో సవాళ్లు.. ప్రతి సవాళ్లు ఆనవాయితీ. అలా అని కుటుంబ సభ్యులపై దాడి చేయటం సరికాదు’’ అని మండిపడ్డారు.
తాము వ్యక్తిగతంగా ఎవరిని ఏ మాటను అనలేదన్న బాలయ్య.. తమ సోదరిపై వ్యక్తిగత విమర్శలు చేయటం బాగోలేదన్నారు. ‘అసెంబ్లీలో ఉన్నామో.. పశువుల కొంపలో ఉన్నామో అర్థం కావట్లేదు. అందరి కుటుంబాల్లో ఆడవాళ్లు ఉన్న వారు ఉన్నారు. హేళన చేయొద్దు’ అని ఘాటుగా రియాక్టు అయ్యారు.
రాజకీయాలతో సంబంధం లేని వారిపై మాటల దాడి సరికాదు. కొత్తతరహా నీచపు కల్చర్ ను తీసుకొచ్చారు. ఈ తీరుపై వైసీపీలోనే ఉన్నవారే బాధపడే వారు కూడా ఉన్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రెస్ మీట్లో బాలయ్య చేసిన మరిన్ని వ్యాఖ్యల్ని చూస్తే..
– జరుగుతున్న ఆరాచకాలకు సమాధానం జనం ఇవ్వాలి. నోటితో కాదు ఓటుతో సమాధానం చెప్పాలి.
– మేం చేతులు కట్టుకొని కూర్చోలేదు. మీరు మారకపోతే మీ మెడలు వంచి మారుస్తాం.
– అసెంబ్లీలో నీచంగా ప్రవర్తిస్తారా? ఓ నలుగురిని ఎంచుకొని ఇష్టమున్నట్లు మాట్లాడుతారా?
– ఏం చేయలేమనుకుంటున్నారా? మీరు ఇష్టం ఉన్నట్లు చేస్తే సహించం. ఆడవారి జోలికి వస్తే ఊరుకోం.
– మీరు ఇష్టం ఉన్నట్లు చేస్తే సహించం.
– గతంలో వ్యాఖ్యలు చేసినప్పుడే మాట్లాడదామనుకున్నా. కానీ.. చంద్రబాబు ఆపారు.
– ఈ రోజు మేం దిగాం. ఎన్టీఆర్ కుటుంబమే కాదు.. యావత్ అన్నగారి అభిమానులు దిగారు. ఇప్పుడిక మేం దిగాం. ఇక ఊరుకోం. నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలి.
– నేను హెచ్చరిస్తున్నా. మీ భరతం పడతా. ఇక నేను ఊరుకోను. ఖబడ్డార్.
– ప్రజలు.. పార్టీ.. కార్యకర్తలు.. నా అభిమానులు.. నా కుటుంబం తరఫున హెచ్చరిస్తున్నా. పద్దతి మార్చుకోండి.
– మళ్లీ రిపీట్ అయితే అన్ని వ్యవస్థలు బద్ధలు కొట్టుకొచ్చి మీ సంగతి చూస్తాం.. ఖబడ్డార్.