ఏపీ సర్కార్ కు హైకోర్టులో ఒకే రోజు రెండు ఎదురు దెబ్బలు తగిలాయి. ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో 25 శాతం తక్కువ అడ్మిషన్లు ఉంటే ఫీజుల ఖరారును నిలిపివేస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబరు 24ను హైకోర్టు కొట్టివేసింది. విశాఖలోని రుషికొండపై ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాలను ఆపాలని దాఖలైన పిటిషన్పై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు డెడ్ లైన్ విధించింది.
ప్రైవేటు డిగ్రీ కాలేజీలలో 25 శాతం తక్కువ అడ్మిషన్లు జరిగాయని ఫీజుల ఖరారును నిలిపివేస్తూ జారీ చేసిన జీవో నంబర్ 24ను పలు కళాశాలలు హైకోర్టులో సవాల్ చేశాయి. ఆ పిటిషన్పై తాజాగా హైకోర్టులో విచారణ జరిగింది. ఆ ప్రతిపాదనకు చట్టబద్ధత లేదని, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఏకపక్ష ధోరణితో జీవో విడుదల చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తక్కువ మంది విద్యార్ధులు ఉంటే అది యాజమాన్యానికి ఇబ్బందని ప్రభుత్వానికి వచ్చిన నష్టమేంటని హైకోర్టు ప్రశ్నించింది. ప్రైవేట్ విద్యాసంస్థల్లో గతంలో ఇటువంటి పరిస్థితి లేదని ధర్మాసనం గుర్తుచేసింది.
కళాశాలలను ఆన్లైన్లో కౌన్సిలింగ్కు పెట్టాలని ఆదేశిస్తూ.. జీవో నెంబరు 24ను సస్పెండ్ చేసింది. మరోవైపు, విశాఖలోని రుషికొండ నిర్మాణాలపై కూడా బుధవారం నాడు హైకోర్టులో విచాణ జరిగింది. ఆ నిర్మాణాలు నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని అనుబంధ పిటిషన్ దాఖలు కాగా..దానిపై విచారణ జరిగింది. ఆ నిర్మాణాలపై కేంద్ర అటవీ పర్యావరణ కమిటీ విచారణ నివేదిక ఇచ్చింది. దీంతో కౌంటర్ దాఖలుకు ప్రభుత్వం తరపు న్యాయవాది వారం రోజులు సమయం కోరగా దానిపై సానుకూలంగా హైకోర్టు స్పందించింది.