జగన్ పై వైఎస్ వివేకా కూతురు సునీతా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని రక్షించే పనిలో జగన్ ఉన్నారని సునీత షాకింగ్ కామెంట్లు చేశారు. జగన్ ప్రభుత్వంలో హత్యా రాజకీయాలు ఎక్కువయ్యాయని, రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయొద్దని ప్రజలకు సునీత పిలుపునిచ్చారు. సిబిఐ మీద ఏ ఒత్తిడి ఉందో తనకు తెలియడం లేదని, విచారణ జరిగితేనే అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలు దోషులో, నిర్దోషులో తేలుతుందని అన్నారు. ఇక, ఈ కేసులో జగన్ పై , ఎంపీ విజయసాయి రెడ్డి పై కూడా విచారణ జరపాలని సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు.
తన తండ్రి హత్య కేసు విషయంలో తాను చేస్తున్న పోరాటంలో తనకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఎంపీ రఘురామకృష్ణరాజు మద్దతుగా నిలిచారని, ముందు నుంచి వైఎస్ షర్మిల తనకు అండగా ఉన్నారని, బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి మద్దతుగా ఉన్నారని చెప్పుకొచ్చారు. వారితో పాటు తనకు అండగా ఉన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ సునీత చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో దుమారం రేపుతున్నాయి. వివేకాను హత్య చేసిన వారిని వదిలిపెడితే ప్రజల్లోకి ఎటువంటి సందేశం వెళ్తుందని? ఇటువంటి నేరాలు ఆగాలంటే నిందితులకు శిక్ష పడాల్సిందేనని అన్నారు.
జగన్ మీద ఉన్న 11 కేసుల మాదిరిగా వివేకా కేసు కూడా ఉండకూడదని చెప్పారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే తనకు న్యాయం జరగదని, తన తండ్రిని హత్య చేసిన వారికి శిక్ష పడదని, జగన్ మళ్ళీ సీఎం అయితే కష్టాలు మరింత ఎక్కువ అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ అవినాష్ రెడ్డికి శిక్ష పడాల్సిందేనని చెప్పారు. సిబిఐ విచారణకు వెళదామని జగన్ ను తాను అడిగితే సిబిఐ విచారణ జరిగితే అవినాష్ రెడ్డి బిజెపిలోకి వెళ్తాడని జగన్ తనతో అన్నారని సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో తనను, తన భర్తను అనుమానించి విచారణ జరిపినట్లుగానే జగన్, విజయసాయిరెడ్డిలను కూడా విచారణ జరపాలని కోరారు.
అవినాష్ రెడ్డి తన సోదరుడైనందు వల్ల మొదట్లో అనుమానించలేదని, ఆ తర్వాత తర్వాత సినిమాల్లో చూపించినట్లుగా నిందితులు తన పక్కనే ఉన్నారని గుర్తించానని చెప్పారు. సిబిఐ విచారణలో జాప్యం వెనుక బీజేపీ హస్తం ఉందో లేదో తనకు తెలియదన్నారు. మాట్లాడితే అక్కచెల్లెమ్మలనే జగన్ ఈ చెల్లెమ్మకు ఎందుకు న్యాయం చేయలేదని ప్రశ్నించారు. తన తండ్రిని చంపిన వారిని రక్షించే పనిలో జగన్ ఉన్నారని, అప్రూవర్ గా మారిన దస్తగిరిని ప్రలోభ పెట్టేదుకు ప్రయత్నించారని ఆరోపించారు. సీబీఐ ఎస్పీ రాంసింగ్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెబితే 20 కోట్లు అడ్వాన్స్ ఇస్తామని దస్తగిరిని ప్రలోభ పెట్టారని ఆరోపించారు.