మొండితనం మంచిదే. కానీ.. మోతాదు మించకూడదు. మొండితనం ఆభరణంలా ఉండాలే తప్పించి.. అమాయకుల ప్రాణాలు పణంగా పెట్టేదిగా ఉండకూడదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. ఆయన తీరును పిల్లాడు సైతం తప్పు పడుతున్నారు. కోవిడ్ వేళ.. అప్రమత్తంగా ఉండాల్సింది పోయి.. కరోనా వచ్చిన తర్వాత కూడా ఏ మాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న ఆయన తీరు ప్రపంచవ్యాప్తంగా వార్తలుగా మారుతున్నాయి. ఆయన బాధ్యతారాహిత్యాన్ని పలువురు తప్పు పడుతున్నారు.
ఇలాంటివేళ.. ఊహించని రీతిలో ఒక ప్రముఖుడు చేసిన వ్యాఖ్యలు అమెరికా అధ్యక్షుల వారిని ఇరుకున పడేలా చేస్తున్నాయి. కట్టుదిట్టమైన భద్రతతో ఉండే వైట్ హౌస్ లో కోవిడ్ కేసులు వెలుగు చూడటం ఏమిటి? నివారించే అవకాశం లేదా? అంటే.. ఉందని చెబుతుున్నారు అమెరికా అంటువ్యాధుల చికిత్స నిపుణుడు ఆంటోని ఫౌఛి. ఆసుపత్రి నుంచి ట్రంప్ డిశ్చార్జి అయి వైట్ హౌస్ కు చేరుకున్న వేళ.. ఫోటోలకు ఫోజులిచ్చేందుకు ముఖానికి ఉన్న మాస్కును తొలగించటాన్ని పలువురు తప్పు పడుతున్నారు.
ఇప్పటికే వైట్ హౌస్ లో ట్రంప్ తో పాటు.. ఆయన సతీమణి.. ఇతర సిబ్బందిని సైతం కరోనా వెంటాడుతోంది. ట్రంప్ నిర్లక్ష్యం.. అలక్ష్యం కారణంగా పలువురు రిపబ్లికన్లకు కూడా మహమ్మారి ముప్పు తప్పలేదు. ఇలాంటివేళ ఫౌఛీ గళం విప్పారు. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. కరోనాను అభూత కల్పనగా భావించే మొండివారితో నివారణ చర్యల గురించి ఏ మాట్లాడగలం? అని ఆయన వ్యాఖ్యానించారు.
వైట్ హౌస్ లో జరుగుతున్నది వాస్తవమని.. ప్రతి రోజు మరింత మంది కోవిడ్ బారిన పడుతున్నారని.. అది అభూత కల్పన ఎంతమాత్రం కాదని.. బ్యాడ్ లక్ అని పేర్కొన్నారు. అసలు దీన్ని నివారించే వీలుందని.. ఇప్పుడున్న పరిస్థితి చోటు చేసుకోకుండా నివారించే వీలుందని ఆయన పేర్కొన్నారు. ఒకప్పుడు ట్రంప్ టీంలో పని చేసిన ఆయన మాటల కారణంగా అధ్యక్షుల వారి ఇమేజ్ కు భారీ డ్యామేజ్ తప్పదని చెబుతున్నారు. ఇప్పటికే అధ్యక్ష ఎన్నికల రేసులో ట్రంప్ వెనుకబడి ఉన్నారన్న అంచనాలు జోరుగా వినిపిస్తున్న వేళ.. ఆయన వ్యక్తిగత ఇమేజ్ ను డ్యామేజ్ చేయటం ఖాయమంటున్నారు.