నిత్యం ఏదో ఒక విశేషం.. మరేదో సంచలనం అన్నట్లుగా ఉంది ట్రంప్ పాలన. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ 2.0 ప్రభుత్వ తీరు మహా జోరుగా నడుస్తోంది. ఎవరేం అనుకున్నా ఫర్లేదు.. తాము అనుకున్నది అనుకున్నట్లుగా పూర్తి చేసేందుకు ఎడాపెడా నిర్ణయాలు తీసుకోవటం ఎక్కువైంది. ఈ క్రమంలో ఎవరూ ఊహించని అంశాల్ని సైతం తెర మీదకు తీసుకురావటం ఆసక్తికరంగా మారింది.
డొనాల్డ్ ట్రంప్ బొమ్మతో 250 డాలర్ల కరెన్సీ నోటును అచ్చేయాలన్న ఆలోచనను తాజాగా షేర్ చేసుకున్నారు అమెరికా ప్రతినిధులసభ సభ్యుడు జోవిల్సన్. దీనికి సంబంధించి చట్టబద్దంగా ఆ నిర్ణయాన్ని అమలు అయ్యేందుకు ప్లాన్ చేస్తున్న వైనం సంచలనంగా మారింది. తాజాగా సోషల్ మీడియాలో ఆయన తన ఆలోచనల్ని షేర్ చేశారు.
బైడెన్ పాలనలో పుట్టుకొచ్చిన ద్రవ్యోల్బణమే తనకీ చర్య తీసుకునేలా చేసిందన్నారు. ప్రస్తుతం అమెరికన్లు భారీ మొత్తంలో డబ్బులు తీసుకెళితే కానీ తమ అవసరాల్ని తీర్చుకోని రీతిలో ధరలు పెరిగిపోయాయని వ్యాఖ్యానించారు. ట్రంప్ ను అత్యంత విలువైన అధ్యక్షుడిగా అభివర్ణిస్తూ.. ట్రంప్ ఫోటోతో 250 డాలర్ల నోటును ముద్రించాలని కోరుతూ బ్యూరో ఆఫ్ ఎన్ గ్రేవింగ్ అండ్ ప్రింటింగ్ కు సూచన చేస్తూ చట్టాన్ని ప్రతిపాదిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ ప్రతిపాదనకు సోషల్ మీడియాలో మిశ్రమస్పందన లభిస్తోంది. కొందరు ఈ ప్రతిపాదనను స్వాగతిస్తుంటే.. మరికొందరు మాత్రం ఎటకారం ఆడేస్తున్నారు. చాలా ముఖ్యమైన అంశాలకు సంబంధించి తీసుకోవాల్సిన నిర్ణయాల కోసం తాము ట్రంప్ కు ఓటేశామని కొందరు పేర్కొంటన్నారు. మరోవైపు తన ప్రతిపాదనను జో విల్సన్ సమర్థించుకుంటున్నారు. చూస్తుంటే.. రానున్న రోజుల్లో ప్రపంచమే అచ్చెరువు చెందే ప్రతిపాదనలు తెర మీదకు వస్తాయేమో?