ప్రపంచంలో ఎవడిని నమ్మినా.. నమ్మకున్నా అమెరికా వాడిని నమ్మొద్దని చెప్పే వారు కొందరు ఉంటారు. ఇలాంటి మాటలు చెప్పే వారిని కాలం చెల్లిన మాస్టర్ పీసులుగా పలువురు వ్యాఖ్యానిస్తుంటారు. ఇలాంటి మైండ్ సెట్ తో భారత్ ను వెనకుబడేలా చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేసే వారు లేకపోలేదు. ఎవరెన్ని అన్నా.. అమెరికాకు తన దేశ ప్రయోజనాలు తప్పించి మరింకేమీ పట్టవు. ఎంత మిత్రుడైనా.. తన తర్వాతే అన్నట్లుగా వ్యవహరించటం.. కొన్నిసార్లు స్నేహాన్ని పక్కన పెట్టేసి స్వార్థంతో వ్యవహరించే తీరు చూస్తే.. వారిని నమ్మటానికి మించిన తప్పు పని మరొకటి ఉండదన్న అభిప్రాయం కలుగక మానదు.
ఎవరెన్నిచెప్పినా.. ట్రంప్ కు జిగిరీ దోస్తు మోడీ. ఇద్దరూ ఇద్దరే. అలాంటి ఈ ఇద్దరి అధినేతల మధ్య సంబంధాలు చాలా సన్నిహితమని చెబుతుంటారు.దీనికి తగ్గట్లే.. ఇప్పటివరకు ఎప్పుడూ దేశ ప్రధాని స్థానంలో ఉన్న వారు చేయని విధంగా మోడీ.. అమెరికాకు వెళ్లి ట్రంప్ కు అనుకూలంగా ప్రచారం చేయటం.. తర్వాతి ఎన్నికల్లోనూ ఆయనే గెలవాలన్న ఆకాంక్షను వ్యక్తం చేయటం తెలిసిందే. దీనిపై పలువురు విమర్శిస్తే.. మరికొందరు సమర్థించారు.
అమెరికా అధినేత ట్రంప్ కు మోడీ ఇంత సన్నిహితమైనా.. ఆయన కుమారుడు జూనియర్ ట్రంప్ తాజాగా సోషల్ మీడియాలో పోస్టు చేసిన పోస్టుపై భారతీయులు మండిపడుతున్నారు. ట్రంప్ కొడుకు చేసిన చెత్తపనిని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఇంతకీ.. అతగాడు చేసిన తప్పుడు పనేమిటంటే.. ప్రపంచ పఠాన్ని పోస్టు చేశాడు. అందులో భారత్.. చైనా తప్పించి మిగిలిన అన్ని దేశాలు ఎరుపు రంగుతో దర్శనమిస్తుంటే.. భారత్.. చైనాలు మాత్రం నీలి రంగులో ఉండటం గమనార్హం.
ఎరుపు రంగు రిపబ్లికన్లను సూచిస్తే.. నీలి రంగు డెమొక్రాట్లను ప్రతిబింబించేది. ట్రంప్ జూనియర్ ఉద్దేశం ఏమంటే.. యావత్ ప్రపంచం మొత్తం తమ వైపు ఉంటే.. భారత్.. చైనాలు మాత్రం తమ వైరిపక్షంలో ఉన్న విషయాన్ని తన పోస్టుతో చెప్పకనే చెప్పేసినట్లుగా చెప్పాలి. ట్రంప్ కొడుకు పెట్టిన పోస్టులోని ఫోటోలో భారత్ మ్యాప్ ను నీలం రంగులో చూపించారు. ఆ మ్యాప్ లో జమ్ముకశ్మీర్ లేకపోవటం.. దాన్ని పాకిస్థాన్ లో చూపించటంతో భారతీయులు పలువురు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అవగాహన లేకుండా ఇలాంటి ఫోటోలు ఎందుకు పెడతావంటూ ఫైర్ అవుతున్నారు. భారత్ ను ట్రంప్ మొదటి నుంచి మిత్రదేశంగా చూస్తుంటే.. ట్రంప్ కొడుకు మాత్రం డెమొక్రాట్లకు మద్దతు ఇచ్చే దేశంగా భారత్ ను చూపించటం.. ఆయన పోస్టు చేసిన ప్రపంచ పఠంలో జమ్ముకశ్మీర్ ను పాక్ లో భాగంగా చూపించిన వైనాన్ని పలువురు తిట్టిపోస్తున్నారు. మరి.. ఈపోస్టుపై భారత ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.