నిజానికి కొన్ని కీలకమైన ప్రశ్నల్ని సాదాసీదా ప్రజలు వేయకున్నా.. మీడియాలో తోపు తురుంఖాన్ లు అనేటోళ్లు వేయటం.. దానికి తగ్గట్లు సమాధానాలు రాబట్టటం ద్వారా.. విషయాల్ని విషయాలుగా బయటకు తీసుకురావటం.. ప్రజలకు తెలిసేలా చేయటం లాంటివి చాలా అవసరం. ఇటీవల పెరిగిన పోటీ.. అసలు విషయాల కంటే కొసరు విషయాలకు మీడియా అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్న నేపథ్యంలో.. ప్రయారిటీలు మారిపోతున్నాయి. చాలా కీలక అంశాలు మరుగున పడిపోతున్నాయి. పాత్రికేయ ప్రొఫెషన్ లో ఉండి కూడా ప్రశ్నించే తత్త్వాన్ని మర్చిపోతున్న విషాదం ఇటీవల చూస్తున్నాం.
అనుకోని రీతిలో బయటకు వచ్చిన ఒక ఆసక్తికర విషయాన్ని విన్నంతనే ఇలాంటి భావన కలగటం ఖాయం. విపక్ష నేతగా ఉన్న వేళలో.. విశాఖ పట్నం ఎయిర్ పోర్టులో ఉన్న జగన్ కు కాఫీ తీసుకొచ్చిన ఒక కుర్రాడు కోడి కత్తితో వైసీపీ అధినేత మీద దాడి చేయటం.. వెంటనే స్పందించటం ద్వారా.. చేతి భుజానికి గాయమైందే తప్పించి.. ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. ఈ కోడి కత్తి దాడి వ్యవహారం అప్పట్లో ఏపీని ఎంతలా ప్రభావితం చేసిందో.. దాని మీద ఎంత రాజకీయ రచ్చ జరిగిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు.
అప్పట్లో కోడి కత్తిని తన వైపు ఝుళిపించిన వేళలో.. జగన్మోహన్ రెడ్డి వేగంగా స్పందించి చేయి అడ్డు పెట్టటం ద్వారా చేతికి మాత్రమే గాయమైంది. కాస్త తేడా కొడితే మెడకు తగలాల్సి ఉందని పేర్కొనటం తెలిసిందే. దీనిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకలాంటి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దాడి జరిగిన వెంటనే విశాఖపట్నం ఎయిర్ పోర్టులో జగన్ కు ప్రథమ చికిత్స చేయటం.. అనంతరం ఆయన్ను హుటాహుటిన హైదరాబాద్ కు తరలించటం తెలిసిందే.
ప్రైవేటు ఆసుపత్రికి తీసుకొచ్చిన జగన్ కు అప్పట్లో డాక్టర్లు సాంబశివారెడ్డి.. డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డిలు కుట్లు వేశారు. సీన్ ఇక్కడ కట్ చేస్తే.. ఇప్పుడు సదరు ఇద్దరు వైద్యులు ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే.. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. తన చేతికి గాయమైన వేళ.. తనకు కుట్లు వేసిన వైద్యులకు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏం చేశారో తెలుసా?
డాక్టర్ సాంబశివారెడ్డిని మెడికల్ కౌన్సిల్ ఛైర్మన్ గా నియమించారు. మరో వైద్యులు డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డిని ఏపీ వైద్య సేవలు.. మౌలిక సదుపాయాల అభివ్రద్ధి సంస్థకు ఛైర్మన్ గా ఎంపిక చేశారు.
వందలాది కోట్ల రూపాయిల మందుల్ని కొనుగోలు చేసేందుకు అవసరమైన పవర్ సదరు డాక్టర్ కు అప్పజెప్పారు. జగన్ పాలనలో ఏపీలో పరిస్థితులు ఎలా ఉన్నాయన్న దానికి నిదర్శనంగా ఈ ఉదంతాన్ని చెప్పొచ్చు. మరి.. తన చేతికి అయిన గాయాలకు కుట్లు వేసిన వైద్యులకు ఇంతలా ప్రతిఫలాన్ని అందిస్తే.. మిగిలిన సాయాలు చేసే వారి పరిస్థితి ఏమిటన్న ఆలోచన కలుగక మానదు. ఈ లెక్కన కోడి కత్తితో దాడి చేసిన కుర్రాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నాడన్న విషయాన్ని వెతికితే మరెలాంటి వివరాలు బయటకు వస్తాయో?