స్కిల్ స్కాం ఆరోపణలతో జ్యూడిషియల్ కస్టడీలో భాగంగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న చంద్ర బాబు ఆరోగ్యం మీద ఆందోళన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఇంతకీ ఆ తీవ్రత ఎంత? ఆయన ఎలాంటి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఆయన్ను పరీక్షించిన వైద్యులు ఏం చెబుతున్నారు? తమ పరీక్షల అనంతరం సమర్పించిన నివేదికలో ఏముంది? జైలు ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏం చెప్పారు? లాంటి అంశాల్ని చూస్తే.. విషయం ఇట్టే అర్థమవుతుంది.
ఈ నెల 12న రాజమహేంద్రవరం జీజీహెచ్ చర్మ వైద్య నిపుణులు డాక్టర్ జి. సూర్యనారాయణ.. డాక్టర్ సీహెచ్ వి సునీతలు జైలు ఉన్నతాధికారులకు నివేదికను సమర్పించారు. ఇందులో.. చంద్రబాబు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యను కళ్లకు కట్టినట్లుగా వైద్యులు పేర్కొనటం కనిపిస్తుంది. ఈ నివేదికలోని అంశాలు శనివారం బయటకు వచ్చాయి. అదే సమయంలో సాయంత్రం వేళలో మరో వైద్యుల టీం చంద్రబాబు ను మరోసారి పరీక్షలు జరిపి.. విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు చెప్పిన వివరాలకు.. నివేదికలో పేర్కొన్న అంశాలకు మధ్య అంతరం కొట్టొచ్చినట్లుగా కనిపించకమానదు.
నివేదికలో పేర్కొన్న అంశాల్ని చూస్తే.. ‘‘ప్రస్తుతం జ్యూడిషియల్ రిమాండ్ లో ఉన్న చంద్రబాబు వీపు.. నడుము.. ఛాతీ.. చేతులు.. గడ్డం తదితర ప్రాంతాల్లో ఎర్రటి దద్దుర్లు.. పొక్కులు ఏర్పడ్డాయి. దీంతో తీవ్రమైన దురద ఏర్పడింది. ఛాతీ.. వీపు.. పొట్ట.. నడుము భాగాల్లో ఎర్రటి దట్టమైన దద్దుర్లు.. పొక్కులు.. గెడ్డంపై ఎర్రటి దద్దుర్లు గమనించాం. రెండు అరచేతుల్లో చీము పొక్కులు చితికిపోవటంతో దురద.. శరీరమంతా తెల్లటి పొక్కులు.. కొన్ని ప్రాంతాల్లో వేడి కురుపులతో ఇబ్బంది పడుతున్నారు. శరీరానికి రోజుకు రెండుసార్లు లోషన్.. రెండు అరచేతులకు అయింట్ మెంట్.. జెల్ రాసుకోవాలి. అలర్జీ.. దురద తగ్గేందుకు రోజుకు ఒక ట్యాబ్లెట్.. విటమిస్ సి పెరిగేందుకు మరో టాబ్లెట్ వాడాలి. దద్దుర్లు.. పొక్కులు శరీరమంతా అధికంగా వ్యాప్తి చెందకుండా.. కొత్త సమస్యలు రాకుండా ఉండాలంటే ఆయన్ను శీతల వాతావరణంలో ఉంచాలి’’ అని పేర్కొన్నారు.
ఇక.. శనివారం చంద్రబాబును పరీక్షించిన వైద్యులు.. జైలు అధికారులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ.. చంద్రబాబును ఆసుపత్రికి తరలించాల్సిన అవసరం లేదన్నారు. చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారని.. ఉక్కపోత వాతావరణం నేపథ్యంలో ఆయనకు చల్లగా ఉండే రూం అవసరమని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని జైలు అధికారులకు తాము తెలియజేసినట్లుగా రాజమహేంద్రవరం జీజీహెచ్ జనరల్ సర్జరీ అసోసియేట్ ప్రొఫెసర్ శివకుమార్ పేర్కొన్నారు. ఐదుగురు సభ్యులతో కూడిన టీం చంద్రబాబుకు పరీక్షలు నిర్వహించారు.
రక్త పరీక్షలు నిర్వహించామని.. బీపీ.. షుగర్ ఫలితాలు నార్మల్ గానే ఉన్నాయని చెప్పారు. జైలు ఆవరణలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్.. తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ జగదీశ్ తో కలిసి డాక్టర్ల టీం హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆరోగ్యంపై మాట్లాడుతూ.. ‘నీరసంగా కనిపించలేదు. మేం అడిగిన ప్రతి ప్రశ్నకు ఉత్సాహంగానే సమాధానం చెప్పారు. ఆయనకు చర్మ సంబంధిత సమస్యలు ఉన్నాయి. జైలు అధికారులకు రిపోర్టు ఇచ్చాం. మీడియాకు ఆ వివరాలు చెప్పలేం’ అని పేర్కొన్నారు.
చంద్రబాబు దద్దుర్లతో బాధ పడుతున్నది వాస్తవమేనని చెప్పిన వైద్యులు.. ‘ఇప్పటివరకు వాడుతున్న మందుల వివరాలు తీసుకున్నాం. ప్రస్తుతం తీసుకోవాల్సిన మందుల గురించి సూచన చేశాం. వ్యక్తిగత వైద్యుడి సలహా తీసుకొని వాడతానని చంద్రబాబు చెప్పారు. ప్రస్తుతం ఉన్న వాతావరణంలో డీహైడ్రేషన్ సమస్య అందరికి ఉంటుంది. అందుకే చల్లటి వాతావరణం కల్పించాలని జైలు అధికారులకు సూచన చేశాం. ఆ సదుపాయం కల్పించకపోతే దురద సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది. చంద్రబాబును ఆసుపత్రికి తరలించాల్సిన అవసరం లేదు. డాక్టర్ల టీం 24 గంటల పాటు అందుబాటులో ఉంటుంది’ అని చెప్పారు.