యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఖరీదైన వాచ్ లపై మోజెక్కువ. ఎన్టీఆర్ వద్ద స్పోర్ట్స్ వాచ్, కస్టమైజ్డ్ వాచ్ ఇలా చాలా కలెక్షన్లు ఉన్నాయి. అయితే తాజాగా తన కొత్త సినిమా లాంఛింగ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ ధరించిన వాచ్ ధర ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ ఓ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. వీరి కాంబో ప్రాజెక్ట్ శుక్రవారం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది.
మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై సంయుక్తంగా ఎన్టీఆర్-నీల్ మూవీని నిర్మిస్తున్నారు. నిన్న ఘనంగా జరిగిన సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సమేతంగా హాజరయ్యాడు. అయితే ఆ సమయంలో ఎన్టీఆర్ చేతికి ధరించిన వాచ్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. దాంతో ఆ వాచ్ గురించి వెంటనే సెర్చింగ్ మొదలు పెట్టారు. బ్రెండ్, ధర వివరాలు తెలుసుకునేందుకు ఆరాటపడ్డారు.
అయితే ఎన్టీఆర్ తన చేతికి పెట్టుకున్న వాచ్ చూడటానికి సింపుల్ గా ఉన్నా.. దాని రేటెంతో తెలిస్తే మాత్రం ఒక్కొక్కరికీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. పటేక్ ఫిలిప్ బ్రాండ్ కి చెందిన లగ్జరీ వాచ్ ను ఆయన ధరించారు. యుఎస్ మార్కెట్ లో ఆ వాచ్ ధర 3 లక్షల డాలర్లు. మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే అక్షరాలా రూ. 2.5 కోట్లు. ఇక ఇంతకంటే ఖరీదైన వాచ్లు కూడా ఎన్టీఆర్ వద్ద ఉండటం విశేషం.