ఈ సార్వత్రిక ఎన్నికలు దేశంలో కాంగ్రెస్ పార్టీకి జీవన్మరణ సమస్య అనే చెప్పాలి. 2004 నుంచి 2014 వరకు రెండు పర్యాయాలు వరుసగా పదేళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారం చెలాయించింది. 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో బొక్కబోర్లా పడింది. గత రెండు ఎన్నికల్లోనూ ఆ పార్టీకి లోక్సభలో ప్రతిపక్ష హోదాకు అవసరమైన 10 శాతం సీట్లు కూడా దక్కలేదు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలు ఆ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారాయి.
ఈ ఎన్నికల్లో కూడా పాత ఫలితాలే పునరావృతం అయితే కాంగ్రెస్ పార్టీ ఉనికికే ప్రమాదం అని పార్టీ అధిష్టానం భావిస్తున్నది. ఇందులో భాగంగానే బీజేపీని ఓడించేందుకు పలు ప్రతిపక్ష పార్టీలతో కలిసి ఎన్నికల ముందు ఇండియా కూటమిని కట్టింది. ఈ ఎన్నికల్లో తమ కూటమి 295 సీట్లు గెలుస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, తదితర నేతలు చెబుతున్నారు. అయితే మొదట కూటమిలో ఉన్న బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత మమతా బెనర్జీ విభేధించి బయటకు వెళ్లింది.
కూటమిలో ఉన్న కాంగ్రెస్, కమ్యూనిస్టులు కొన్ని చోట్ల పోటీ పడ్డాయి. ఈసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని రాహుల్ గాంధీ రెండు పర్యాయాలు భారత్ జోడో యాత్రను చేపట్టాడు. కానీ అది పెద్దగా ఫలితాలు ఇస్తుందన్న నమ్మకం కుదరడం లేదు. హిందుత్వ నినాదంతో బీజేపీ ఓట్లను ఆకర్షించే ప్రయత్నం చేసింది. పదేళ్ల మోడీ పాలనా వైఫల్యాలనే కాంగ్రెస్ పార్టీ నమ్ముకుంది. ఆయా రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలదే పై చేయి అవుతుందని, ఆ పార్టీలన్నీ తమే మద్దతు ఇస్తాయని కాంగ్రెస్ ఆశగా ఉంది. మరి కొన్ని గంటలు ఆగితే కాంగ్రెస్ పార్టీ భవితవ్యం తేలిపోనుంది.