ఐదు రాష్ట్రాలకు జరుగుతున్నఎన్నికల్లో భాగంగా తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. రోటీన్ కు భిన్నంగా వరుసగా రెండుసార్లు అధికారాన్ని చేజిక్కించుకున్న అన్నాడీఎంకేకు.. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారాన్ని సొంతం చేసుకోవాలని తపిస్తున్న డీఎంకేకు మధ్య పోటీ తీవ్రంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఇలాంటివేళ.. డీఎంకే అభ్యర్థికి మద్దతుగా మాజీ కేంద్రమంత్రి రాజా ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా తమిళనాడుముఖ్యమంత్రి పళనిస్వామిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. రాజా చేసిన వ్యాఖ్యలు అధికార అన్నాడీఎంకే నేతలకు.. కార్యర్తలకు తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించేలా ఉన్నాయి. చట్ట సమ్మతం కాని రీతిలో నెలలు నిండకుండానే పుట్టారన్నారు.
‘స్టాలిన్ పొలిటికల్ కెరీర్.. చట్టబద్ధమైన సంబంధానికి పుట్టిన పూర్తి పరిణితి సాధించిన శిశువు లాంటిది. పళనిస్వామి రాజకీయ కెరియర్ అక్రమ సంబంధానికి నెలలు నిండకుండానే పుట్టిన శిశువు లాంటిది. స్టాలిన్ కాలి చెప్పులంత విలువ కూడా ఆయనకు లేదు. స్టాలిన్ చెప్పుల విలువ ఈపీఎస్ కంటే రూపాయి ఎక్కువే. నిన్నమొన్నటివరకు పళనిస్వామి బెల్లం మార్కెట్ లో పని చేశారు. ఆయన స్టాలిన్ కు ఎలా పోటీ అవుతారు?’ అంటూ విరుచుకుపడ్డారు.
రాజా చేసిన వ్యాఖ్యలకు అన్నాడీఎంకే ఉడికిపోతోంది. కీలకమైన ఎన్నికల వేళ ..దారుణమైన డ్యామేజ్ చేసేలా వ్యాఖ్యలు ఉండటంతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయటంతో పాటు.. న్యాయపోరాటాన్ని చేయాలని అధికారపక్షం భావిస్తున్నట్లు చెప్పారు. ఏమైనా.. రాజా మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయని చెప్పక తప్పదు.