వైసీపీ సీనియర్ లీడర్ జగన్ సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనేమీ అనామక నాయకుడు కాదు, ఎప్పుడో 1980లలో రాజకీయంలోకి వచ్చారు. జగన్ తండ్రి కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పాటు రాజకీయాల్లోకి ప్రవేశించారు.
ఆయనే డీఎల్ రవీంద్రారెడ్డి, పేరున్న ఫైర్ బ్రాండ్ నేత. కాంగ్రెస్ ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు. వైఎస్ కేబినెట్లోను మంత్రిగా పనిచేసిన ఆయన తర్వాత వైసీపీలో చేరారు. తాజాగా జగన్ పాలనపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
సీఎం జగన్ తో పాటు ఆయన తర్వాత వైసీపీ సర్కార్ లో నంబర్ టూగా చెలామణి అవుతున్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పైనా డీఎల్ ఇవాళ ఫైర్ అయ్యారు. ఏపీలో రెడ్ల రాజ్యం కావాలనుకున్న వారికి తగిన శాస్తి జరిగింది అన్నారు.
రాష్ట్రంలో ఏ శాఖ మంత్రి ఆ శాఖకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టడం లేదని అంటూ దారినపోయే వారందరూ మీడియా సమావేశాలు పెడుతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డిని కార్నర్ చేస్తూ కామెంట్లు చేశారు. ఇప్పటికే సజ్జల దూకుడుపై సొంత పార్టీ నేతలు నివురు గప్పిన నిప్పులా ఉన్నారు. ఇపుడు డీఎల్ రవీంద్ర రెడ్డి బయటపడ్డారు.
వ్యవసాయం, విద్యుత్, మహిళా సంక్షేమం, అర్బన్. ఇలా అన్నింటిపైనా కొన్నాళ్లుగా సజ్జల రెడ్డే మాట్లాడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కడప వైసీపీ లీడరు, అది కూడా పేరున్న నేత డీఎల్ కామెంట్లు వైసీపీకి పెద్ద సెగే.
కేసలం సజ్జలమీదే కాదు, జగన్ పై కూడా డీఎల్ రవీంద్రారెడ్డి మరో సంచలన ఆరోపణ కూడా చేశారు. జగన్ పేరు ఎత్తకుండా పాలకులు సొంత ఖజానా నింపుకోవడమే ధ్యేయంగా పనిచేస్తున్నారని డీఎల్ రవీంద్రారెడ్డి ఆరోపించారు.
ఏపీలో దురదృష్టకరమైన పరిస్థితులున్నాయి. వ్యవసాయం సంక్షోభంలో పడిపోయింది. రైతును పట్టించుకునే నాథుడే లేడు. పొలాన్ని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసే కౌలు రైతు కరువయ్యాడు. తన సొంత పొలాన్ని కౌలుకు ఇద్దామనుకున్నా ఎవరూ ముందుకు రావడం లేదు… అంటూ డీఎల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
సొంత జిల్లా వైసీపీ నేత చేసిన ఈ కామెంట్లు కలకలం రేపుతున్నాయి. సీనియర్ అయిన డీఎల్ 2019 ఎన్నికల్లో కడప జిల్లాలో వైసీపీ అభ్యర్ధులకు మద్దతు ఇచ్చారు. జగన్ తో కలిసి ప్రచారంలోనూ పాల్గొన్నారు. అయితే, వైసీపీ అధ్వాన పాలనతో డీఎల్ విసిగిపోయి ఈ కామెంట్లు చేశారు.