కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకుడు, మాజీ మంత్రి.. ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కడపకు చెందిన నేత డీఎల్ రవీంద్రారెడ్డి.. జగన్ పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల కాలంలో తరచుగా మీడియా ముందుకు వస్తున్న డీఎల్.. జగన్ను టార్గెట్ చేస్తున్న విషయం తెలిసింది. ఈ క్రమంలో తాజాగా.. ఆయన జగన్ ప్రభుత్వతీరు.. పథకాల అమలు.. చట్టాలను వెనక్కి తీసుకోవడం.. వంటివాటి విషయంలో తీవ్రంగా స్పందించారు.
రెండున్నర సంవత్సరాల జగన్ పాలనలో ఓట్లు వేసిన ప్రజలు ఓడిపోయారని ఆయన హాట్ కామెంట్ చేశారు. జగన్ పాలనపై ఎందరో ఆశలు పెట్టుకున్నారని.. కానీ, ఎవరికీ న్యాయం జరగలేదని వ్యాఖ్యానించారు. వాస్తవానికి జగన్ పాలనలో కొంతమందికి మాత్రమే న్యాయం జరిగింది అనుకున్నారని, కానీ.. వారికి కూడా ఏమీ న్యాయం జరగలేదన్నారు.
ప్రభుత్వం తీసుకువస్తున్న పథకాలకు వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు పెడుతున్నారని.. దీని వల్ల ఆయన పేరు చెడిపోతోందని డీఎల్ వ్యాఖ్యానించారు. గతంలో 2006లో వైఎస్ పాలనలో మహిళల అభ్యున్నతి కోసం.. అభయహస్తం పథకాన్ని తీసుకువచ్చారని.. ఇది మహిళలకు జీవిత వృద్ధాప్యంలో ఎంతో ఉపయోగకరంగా ఉండేదని.. ఇప్పుడు దానికి కూడా జగన్ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని అన్నారు. ఇప్పటికే దీనికింద ఉన్న రూ.2000 కోట్లను జగన్ లాగేసుకున్నారనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికే సెర్ఫ్ సీఈఓ పదవిని రద్దు చేశారని డీఎల్ తెలిపారు.
“దివంగత రాజశేఖరరెడ్డి పెట్టిన పథకాలను రద్దు చేస్తున్నారు. ఇక, ఆయన పేరు ను వాడుకోవడం ఎందుకు? ఆయన పేరుతో పథకాలు తీసుకురావడం ఎందుకు?“ అని డీఎల్ ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద.. కాలేజీలకు కట్టాల్సిన నిదులను తల్లుల ఖాతాల్లో వేయడం ఎందుకు..? వారు మళ్లీ కాలేజీల్లో కట్టడం ఎందుకు? అలా కట్టకపోతే.. మళ్లీ పింఛన్లు ఇవ్వమని చెబుతున్నారు..? ఇది సమంజసమా? ఇదేం పాలన? అని డీఎల్ విస్మయం వ్యక్తం చేశారు.
వైఎస్ ఘనంగా అమలు చేసిన ఆరోగ్య శ్రీ పథకం కూడా నీరుగారిపోతోందన్నారు. ఈ పథకంలో జబ్బులు సంఖ్య పెంచినా ప్రయోజనం లేదని పెదవి విరిచారు. పేద కుటుంబాలకు చెందిన వారు కూడా కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందాలనే ఒక సమున్నత లక్ష్యంతో రాజశేఖరరెడ్డి ఈ పథకాన్ని తీసుకువచ్చారని డీఎల్ వివరించారు.
“విద్యా దీవెన లాంటి ఎన్నో పథకాలు నిర్వీర్యం అయ్యాయి. నవారత్నాలు పేరుతో లబ్దిదారులను ప్రభుత్వం బ్రష్టు పట్టిస్తోంది. జగనన్న శాశ్వత గృహ నిర్మాణ పథకంలో 10,000 కట్టకుంటే పెన్షన్ తీసేస్తాం అంటున్నారు. ఇది దేనికి సంకేతం? గ్రామాలలో లా అండ్ ఆర్డర్ సమస్యలు పెరిగిపోతున్నాయి. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం రద్దు చేయాలని కోరుతున్నా. ఈ పథకం కింద కేవలం ప్రభుత్వానికి 1500 కోట్లు మాత్రమే వస్తుంది“ దీనిని అమలు చేసి.. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తారా? అనిడీల్ ప్రశ్నించారు. రాష్ట్రం దురదృష్టకర పరిస్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థికంగా కూడా రాష్ట్రం దివాలా తీసేలా ఉందన్నారు.
ఒక ఉన్నత అధికారి తన సంస్థకే చెందిన నిధుల విషయంలో తానేమీ చేయలేనని పేర్కొంటూ.. తాను నపుంసకుణ్ణి అని చేతులు ఎత్తేశారని, అధికారులు ఎందుకు ఇంతలా దిగజారుతున్నారని డీఎల్ నిలదీశారు. సీఎం ఏం చెప్తే దానికి తల ఊపి సంతకం పెట్టడం ఏంటని ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఎక్కడా పెట్టుబడులు రావడం లేదని, ఎవరూ కూడా ఆ ఊసు ఎత్తడం లేదని చెప్పారు. రైతుల నుండి వరి కొనే పరిస్థితి లేదన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎక్కడున్నాయో రైతులకు తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. ధరల స్థిరీకరణ నిది ఏమైందన్నారు. ప్రకృతి వైపరీత్యంలో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఇటీవల వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇళ్లు కోల్పోయిన వారికి ఎంగిలి మెతుకులు విదిలించారని డీఎల్ ఆక్షేపించారు. 95,100 రూపాయలతో ఇల్లు ఎలా నిర్మించుకుంటారని ప్రశ్నించారు. ప్రభుత్వం అందించే డబ్బు ద్వారా.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగలేదన్న ఆయన.. కేవలం కరోనా నేపథ్యంలోనే విద్యార్థులు చేరారని తెలిపారు. వచ్చే రెండున్నర సంవత్సరాల్లో అయినా రాష్ట్రాన్ని ఆ దేవుడే కాపాడాలని సూచించారు.
కింది స్థాయిలో అవినీతి వల్లే చంద్రబాబు ఓడి పోయారని.. దిగువ స్థాయిలో అవినీతి అదుపు చేయాలని సూచించారు. అవినీతి పేద ప్రజలను తినేస్తోందని తెలిపారు. ఒడిసా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అవినీతి అధికారులను తొలగించి ప్రజలకు ఆదర్శవంతమైన పాలన అందించారని తెలిపారు. అందుకే ప్రజలు ఆయనను ఐదు సార్లు ముఖ్యమంత్రిని చేశారని తెలిపారు.
ఒడిసా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తన పాలనలో అవలంబించే పద్ధతులను ఏపీలోనూ జగన్ పాటిస్తే మరో మారు అధికారంలోకి వస్తారని.. లేకపోతే.. ఇక్కడితో సరి! అని డీఎల్ వ్యాఖ్యానించారు. రాజశేఖర్ రెడ్డి కన్నా ఎక్కువ పెరు సంపాదిస్తానన్న జగన్ ఆయన పెట్టిన పథకాలు తీసేయడం ద్వారా సంపాయిస్తున్నారా? అని ఎద్దేశా చేశారు.