సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి, దివంగత నేత వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసు విచారణ రోజుకో మలుపు తిరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో అప్రువర్ గా మారిన దస్తగిరి మొదలు..వివేకా భార్య సౌభాగ్యమ్మ ఇచ్చిన వాంగ్మూలం వరకు ఒక్కొక్కటిగా సంచలన విషయాలను వెలుగులోకి వస్తున్నాయి. ఆ వాంగ్మూలాలలో సీఎం జగన్ పై కూడా సునీతా రెడ్డి, రాజ శేఖర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.
అంతేకాదు, ఈ కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర రెడ్డిల పాత్రపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దానికి తోడు సీబీఐ నోటీసులను తీసుకునేందుకు అవినాశ్ రెడ్డి అంగీరించలేదన్న ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ వ్యవహారంపై మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసులో ఇద్దరు పెద్దల హస్తం ఉందన్న ప్రచారం జరుగుతోందని, ఆ వ్యవహారంపై సీబీఐ నిగ్గుతేల్చాలని రవీంద్రా రెడ్డి కోరారు.
వివేకా హత్య కేసులో సీబీఐ నిష్పాక్షికంగా దర్యాప్తు జరుపుతోందని ఆయన అన్నారు. కానీ, వివేకా కేసులో పులివెందులలో వైసీపీ నేతల ప్రమేయంపై ప్రచారం జరుగుతోందని, వైసీపీ నేతల ప్రమేయాన్ని కప్పిపుచ్చుకోవడానికి సజ్జల విశ్వప్రయత్నం చేస్తున్నారని డీఎల్ ఆరోపించారు. వివేకా హత్యకేసును ఆయన కూతురు వైఎస్ సునీతా రెడ్డి కుటుంబంపైకి నెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని రవీంద్రా రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
ఈ కేసులో సునీత కుటుంబానికి ఏ పాపం తెలియదని తాను అనుకుంటున్నానని రవీంద్రా రెడ్డి అన్నారు. వివేకా హత్య కేసులో నిందితులెవరూ తప్పించుకోలేరని ఆయన అన్నారు. బాబాయి హత్యకు గురైనరోజు జగన్ సాయంత్రానికి చేరుకోవడాన్ని ఏమనాలని డీఎల్ ప్రశ్నించారు. నిందితులను కాపాడేందుకు ఎవరు ప్రయత్నిస్తున్నారో ఆత్మపరిశీలన చేసుకోవాలని పరోక్షంగా జగన్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.