మరి కొద్ది నెలల్లో దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అయితే.. ఆ ఐదు రాష్ట్రాల్లో మిగిలిన రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా.. తెలంగాణ ఫలితం మీద పెద్ద ఎత్తున ఆసక్తి వ్యక్తమవుతోంది. కర్ణాటక ఎన్నికల్లో సాధించిన విజయంతో కాంగ్రెస్ కొత్త ఉత్సాహంతో ఉంది. ఈ ఊపులో.. త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల్లో వీలైనన్ని ఎక్కువ రాష్ట్రాల్లో గెలుపు జెండాను ఎగురవేయాలన్న తపనతో ఉంది.
తమకు అత్యంత కీలకమైన తెలంగాణలో విజయం కోసం కాంగ్రెస్ అధినాయకత్వం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది. అన్ని ఉన్నా.. అల్లుడి నోట్లో శని మాదిరి.. తెలంగాణలోని కేసీఆర్ సర్కారు మీద ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ.. దాన్ని అందిపుచ్చుకోవటంలో మాత్రం పార్టీ నేతలు ఫెయిల్ అవుతున్న వైనంపై కాంగ్రెస్ అధినాయకత్వం గుర్రుగా ఉంది. అందుకే.. ఈసారి జరిగే ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా.. విజయాన్ని సాధించేందుకు ఉన్న అన్ని అవకాశాల్ని వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.
తెలంగాణలో పార్టీ బాధ్యతల్ని.. ఎన్నికల వేళ వ్యూహాన్ని అమలు చేసే విషయంలో పార్టీ అధినాయకత్వంలోని కీలక నేత ప్రియాంకను తెలంగాణకు కేటాయిస్తారని చెబుతున్నా.. ప్రాక్టికల్ గా అదంతా సాధ్యమయ్యే పని కాదంటున్నారు. కాకుంటే.. తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టే ప్రియాంకకు.. దన్నుగా నిలిచేందుకు పార్టీ ట్రబుల్ షూటర్.. కర్నాటకలో కాంగ్రెస్ విజయంలో కీ రోల్ ప్లే చేసిన డీకే శివకుమార్ ను తెలంగాణ బాధ్యతల్ని అప్పజెప్పాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ ఏర్పాటు చేసిన తర్వాత రెండుసార్లు కేసీఆర్ పార్టీ విజయం సాధించిన వేళ.. మూడో సారి తాము అధికారాన్ని సొంతం చేసుకోవాలన్న తపనతో కాంగ్రెస్ ఉంది. అందుకు అవసరమైన అన్ని శక్తుల్ని కూడగట్టుకోవటంతో పాటు.. అధికారాన్ని చేజిక్కించుకోవటానికి అవసరమైన ప్రయత్నాల్ని చేస్తున్నారు. ప్రియాంక ప్రత్యేక వినతితో డీకే శివకుమార్ తెలంగాణ పై ప్రత్యేక ఫోకస్ చేయనున్నట్లు చెబుతున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ కు వ్యతిరేకంగా ఉండే వారిని పార్టీలోకి తీసుకొచ్చేందుకు బెంగళూరు కేంద్రంగా పావులు కదులుతున్నట్లు చెబుతున్నారు.
తాజాగా వెలువడుతున్న అంచనాలకు తగ్గట్లు తెలంగాణ బాద్యతల్ని డీకే చేతికి ఇస్తే.. పార్టీలోని వ్యతిరేకుల్ని ఒక తాటి మీద నిలిచేలా చేయటంతో పాటు.. అసమ్మతిని నియంత్రించే సత్తా ఆయనకు ఉందంటున్నారు. ఎన్నికలకు ముందు ప్రచారం.. అభ్యర్థుల ఎంపిక.. భారీ బహిరంగ సభలు.. ఇలా ప్రతి విషయంలోనూ ఆయనకు ఉన్న పట్టు తెలంగాణలో పార్టీకి ప్రయోజనం కలిగేలా చేస్తుందంటున్నారు. ట్రబుల్ షూటర్ డీకేకు తెలంగాణ బాధ్యతల్ని అప్పజెబితే మాత్రం సీన్ మారటమేకాదు.. గులాబీ బాస్ కు కొత్త సవాలు ఎదురైనట్లేనన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.