కర్ణాటక శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ విజయదుందుభి మోగించిన సంగతి తెలిసిందే. అయితే ఓ పక్క బిజెపిని గద్దె దించి కన్నడనాట కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించిన ఆనందం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పూర్తిగా లేకుండా పోయింది. కర్ణాటకకు కాబోయే సీఎం ఎవరు అన్నదానిపై స్పష్టత రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ కేడర్ సందిగ్ధంలో పడింది. కర్ణాటకలో పార్టీ గెలుపు కోసం కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ తో పాటు కర్ణాటక మాజీ సీఎం, సీనియర్ నేత సిద్ధరామయ్య కూడా తీవ్రంగా కష్టపడ్డారు.
ఈ నేపథ్యంలో సీఎం పదవి ఎవరిని వరిస్తుంది అన్న దానిపై సస్పెన్స్ ఇంకా వీడలేదు. ఈ నేపథ్యంలోనే సిద్ధూ, డీకేలు ఇద్దరూ ఈరోజు ఢిల్లీలో కాంగ్రెస్ హై కమాండ్ తో భేటీ అయ్యేందుకు ఢిల్లీ వెళ్లారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలతో వీరిద్దరూ చర్చలు జరుపుతున్నారు. మరోవైపు పీసీసీ అధ్యక్ష పదవికి డీకే శివకుమార్ రాజీనామా చేయబోతున్నారంటూ పుకార్లు వస్తున్నాయి.
అయితే, ఆ వదంతులను డీకే ఖండించారు. పార్టీ తనకు కన్నతల్లి వంటిదని, పార్టీ నిర్మాణంలో అడుగడుగునా తన పాత్ర ఉందని డీకే వెల్లడించారు. మరోవైపు, తనకు డీకే శివకుమార్ తో ఎటువంటి విభేదాలు లేవని సిద్ధరామయ్య చెబుతున్నారు. అయితే, లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు సిద్ధ రామయ్యను సీఎంగా కొనసాగించి ఆ తర్వాత డీకేకు పట్టాభిషేకం చేయాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇద్దరు నేతల అభిమానులు తమ నేత సీఎం కావాలని ఎవరికి వారు ప్రకటనలు ఇస్తున్నారు.