ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, పోలీసులు…ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారని, విపక్ష పార్టీల నేతలను, కార్యకర్తలను ఇబ్బందిపెడుతున్నారని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. పోలీసులను తమకు అనుగుణంగా వాడుకుంటోన్న ప్రభుత్వం…వారి బాగోగులు పట్టించుకోవడం లేదని కూడా విమర్శలు వస్తున్నాయి. తమకు రావాల్సిన గ్రాంట్లు, టీఏ, డీఏలు, ఇతర బకాయిలు చెల్లించడం లేదని అనంతపురంలో ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ప్రకాష్ గతంలో చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి.
సేవ్ ఏపీ పోలీస్ అంటూ కొద్ది నెలల క్రితం జగన్ పర్యటన సందర్భంగా ప్రకాష్ ప్లకార్డు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత ప్రకాష్ ను ఎస్పీ ఫకీరప్ప సస్పెండ్ చేసిన వ్యవహారం పెను దుమారం రేపింది. అయితే, కేవలం ప్లకార్డు పట్టుకున్నందుకే తనను సస్పెండ్ చేశారని ప్రకాష్ ఆరోపిస్తున్నారు. అయితే, ప్రకాష్ పై గతంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విచారణ జరిపి డిస్మిస్ చేశామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రకాష్ ను ఏపీ పోలీసులు మరోసారి అడ్డుకున్నారు. తనకు న్యాయం చేయాలంటూ ప్రకాష్ చేపట్టిన సైకిల్ యాత్రకు అనుమతి లేదని పోలీసులు ఆపివేయడం చర్చనీయాంశమైంది. తనను ఉద్యోగంలోకి మళ్లీ తీసుకోవాలని, బకాయిలు చెల్లించాలని కోరుతూ ప్రకాష్ అనంతపురం ప్రెస్ క్లబ్ నుంచి సైకిల్ యాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. అంతేకాదు, ఏపీ పోలీసులను రక్షించాలని, సామాజిక న్యాయం చేయాలని సేవ్ ఏపీ పోలీస్ పేరుతో ప్లకార్డులు పెట్టుకొని సైకిల్ యాత్ర చేసేందుకు ప్రకాష్ ప్రయత్నించారు.
అయితే, ఈ యాత్రకు అనుమతి లేదని చెబుతూ పోలీసులు ప్రకాష్ ను అడ్డుకొని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మరోసారి ప్రకాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష కట్టిందని, వారిక ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో పోలీసులు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రకరకాల కారణాలతో మొత్తం 358 మంది పోలీసులను విధుల నుంచి తప్పించాలని ఆరోపించారు. తనకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని అడిగినందుకే సస్పెండ్ చేశారని ఆరోపించారు.