అధ్యయనం చేయకుండా అనాలోచిత నిర్ణయాలు
బిల్లులపై సమగ్ర చర్చే లేదు
కేంద్రం చేయాల్సిన సవరణలు మనం చేస్తే నిలవదు
ఆలోచనల్లో ఆవేశం.. ఆచరణలో బొక్కాబోర్లా
గందరగోళంగా సాగుతున్న రాష్ట్ర పరిపాలన
అయోమయంలో అధికారులు
లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా బుర్రకు తోచిన విషయాలపై విధాన నిర్ణయాలు తీసుకోవడం.. వాటిని అమలు చేయడానికి సొంతంగా చట్టాలు చేయడం.. ఆచరణలోకి వచ్చేసరికి అవి చెల్లుబాటుకాక బొక్కాబోర్లాపడడం.. ఇదీ జగనన్న సర్కారు తీరు. అయినా తప్పు తనది కాదంటూ కోర్టులపైనో, మరొకరిపైనో నిందలువేసి తప్పించుకోవడం గత సంవత్సరమంతా ప్రభుత్వానికి షరా మామూలయిపోయింది. రాష్ట్ర భవిష్యతను ప్రభావితం చేసే కీలకమైన అంశాల్లో దేశంలోనే అందరికంటే ముందే తామంటూ తీసుకొచ్చిన చట్టాలు, విధాన నిర్ణయాలను అటు కోర్టులే కాదు.. చివరకు కేంద్ర సర్కారు కూడా తప్పుపట్టింది. వాటిని వెనక్కు తీసుకోవాని కర్రుకాల్చివాతపెట్టినట్లు చెప్పింది. కోర్టులపై నిందలు వేసినంత సులువుగా కేంద్రం చర్యలను ప్రశ్నించడం అయ్యేపనికాదు. మా చట్టం మా ఇష్టమని గొంతెత్తే సాహసం చేయలేక గుట్టుగా సర్దుకుపోతోంది. ఒకటో రెండోకాదు.. ఏకంగా ఏడెనిమిది కీలకమైన అంశాల్లో రాష్ట్ర సర్కారు నిర్ణయాలు బెడిసికొట్టాయి. కిందపడ్డా పైచేయితనదే కావాలన్న తపనతో కొన్ని అంశాల్లో మళ్లీ మళ్లీ అదే తొందరపాటును ప్రద ర్శిస్తున్నా…మరి కొన్నింట్లో కేంద్రాన్ని నొప్పిస్తే పనులు కావంటూ దిశ, దశనే మార్చుకుంటోంది. చట్టాలు రూపొందించడమంటే ఎంతో అధ్యయనం, న్యాయ పరిశీలన అవసరం. కేంద్ర చట్టాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఇప్పటికే అమల్లో ఉన్న ఇతర చట్టాలను పరిశీలన చేయాలి. న్యాయ నిపుణులను సంప్రదించాలి. న్యాయశాఖ అభిప్రాయం తీసుకోవాలి. వీటన్నిటినీ తోసిరాజని.. నాయకుడి ఆవేశానికి తగినట్లుగా చట్టాలు రూపొందిస్తే అవి ఎంత వేగంగా కేంద్రానికి వెళ్తున్నాయో.. అంతే వేగంగా తిరస్కరణకు గురై వెనక్కి వస్తున్నాయి. రాష్ట్రప్రభుత్వ పరువు, ప్రతిష్టలను పెంచేవని భావించిన దిశ బిల్లు-2019, ల్యాండ్ టైటిల్ బిల్లు-2019లను కేంద్రం నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ఇవి కేంద్ర చట్టాలకు పోటీగా ఉండడమే దీనికి కారణం.
దిశదిశా లేని దిశ చట్టం..
తెలంగాణలో 2019 నవంబరు 27న చోటుచేసుకున్న దిశ సంఘటన, అనంతర పరిణామాలను దేశం ఇంకా మరచిపోలేదు. అలాంటి ఉదంతాలు ఇంకా అనేకం జరిగిపోతూనే ఉన్నాయి. ఏపీలో తాజాగా ధర్మవరంలోనూ ఇలాంటి దారుణమే చోటుచేసుకుంది. అయితే, దిశ సంఘటన తమను కలచివేసిందని, ఇక మహిళలపై అత్యాచారాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షిస్తామని, ఇందుకు దేశంలోనే తొలిసారిగా చట్టం తీసుకొస్తున్నామని సీఎం జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ఆ చట్టంపేరు ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం-శిక్షాస్మృతి-2019. సంఘటన జరిగిన కేవలం 16 రోజుల్లోనే అసెంబ్లీ ఈ బిల్లును ఆమోదించి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించారు. 23 రోజుల్లోనే కేసుల విచారణ జరిపి, నేరస్తులను నిర్ధారించి ఉరిశిక్ష వేసేలా బిల్లు తయారయింది. ఏడాది తర్వాత ఈ బిల్లును కేంద్రం వెనక్కి తిప్పి పంపింది. జాతీయస్థాయిలో నిర్భయ-2012, ఐపీసీ-1860, సీపీసీ-1973, పోస్కో-2012 తదితర కేంద్ర చట్టాలను తోసిరాజేలా దిశ బిల్లు ఉందని తిరస్కరించింది. కానీ ఈ బిల్లు ఆమోదం పొందకముందే ప్రభుత్వం చాలా ఆర్భాటంగా దిశ పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేసింది. ప్రత్యేక అధికారులను నియమించింది. తీరా బిల్లును కేంద్రం తిరస్కరించేసరికి సర్కారు చేష్టలుడిగిపోయింది. చేసేదేమీలేక ఆ బిల్లును అసెంబ్లీని నుంచి ఉపసంహ రించుకుంది. కేంద్రం ఇచ్చిన సూచనల మేరకు దిశ ప్రత్యేక కోర్టుల ఏర్పాటు బిల్లుగా మార్చుకొని అసెంబ్లీలో ఆమోదించుకున్నారు. ఇందులో 15 రోజుల్లో కేసుల విచారణ, 23 రోజుల్లోనే శిక్షల ఖరారు, ఉరిశిక్షలు వంటివి తొలగించారు. మహిళలపై జరిగే అత్యాచారాలు, దాడుల అన్నింటిని, ఇప్పటికే అమల్లో ఉన్న కేంద్ర చట్టాల్లోని సెక్షన్ల ప్రకారం కేసులు నమోదుచేస్తామని, వీటి విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తామని ఆ బిల్లులో సర్కారు పేర్కొంది. చెప్పుకోవడానికి, వినడానికి దిశ బిల్లు ఉంటుంది. కానీ అసెంబ్లీలో సీఎం జగనన్న గర్జించి చెప్పిన అంశాలేవీ ఉండవు. ఈ పరిస్దితి ఎందుకొచ్చింది? ఎవరి తొందరపాటు దిశ బిల్లును వెంటాడింది? చట్టాలను రూపొందించే సమయంలో పరిపాలనా అనుభవం, న్యాయ అంశాల అధ్యయనం, పరిశీలనలు ఉండాలి. నిపుణులతో చర్చించాలి. ఆవేశం వచ్చింతే తడువుగా బిల్లులు రూపొందిస్తే ఇదే పరిిస్థితి ఎదురవుతుంది. అయినా దీనిపై సీఎం నుంచి డీజీపీ వరకు డప్పు కొట్టుకుంటున్నారు. దిశ కోర్టులు, ప్రాసిక్యూటర్లను నియమిస్తామని డీజీపీయే చెబుతుంటే ఏం చేయాలో అర్థం కావడం లేదు. పసలేని చట్టం తెచ్చి డబ్బా కొట్టుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
అదే దారిలో టైటిల్ బిల్లు..
భూ వివాదాల పరిష్కారం, యజమానులకు శాశ్వత భూ హక్కు కల్పించే పేరిట దేశంలో అందరికంటే ముందుగా తామే ల్యాండ్ టైటిల్ చట్టం తీసుకొస్తామని జగన్ ప్రభుత్వం ప్రకటించింది. బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రం ఆమోదానికి పంపించింది. కేంద్ర రిజిసే్ట్రషన్ చట్టం-1908, స్టాంప్ యాక్ట్, భూ సేకరణ చట్టం-2013లను తోసిరాజేలా టైటిల్ బిల్లు ఉందంటూ కేంద్రం దాన్ని వెనక్కి పంపించింది. ప్రభుత్వం ఆ బిల్లును ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ఉపసంహరించుకుంది. బిల్లులో కేంద్ర చట్టాలను ధిక్కరించే కీలకమైన మూడు అంశాలను తొలగించి మరోసారి టైటిల్ బిల్లు-2020ని సభలో ఆమోదించారు. అయితే ఇందులో ఇంకా సమస్యలు ఉన్నాయంటూ అధికార వర్గాలే చెబుతున్నాయి. అప్పీల్ కాలపరిమితిని మూడేళ్ల నుంచి రెండేళ్లకు కుదించారని, ఇది కేంద్ర చట్టాలకు విరుద్ధమని అంటున్నాయి. టైటిల్ బిల్లును కేంద్రం ఇంకా ఆమోదించకముందే.. రాష్ట్రం హడావుడిగా భూముల సమగ్ర సర్వేను ప్రారంభించింది. సర్వే అనంతరం టైటిల్ ఇస్తామని చెబుతోంది. కానీ సర్వేకు మూలాధారమైన ఏపీ సర్వే, సరిహద్దుల చట్టంలో అప్పీల్స్ గడువు మూడేళ్లు ఉంది. ఒకే అంశంపై రెండు చట్టాల్లో విరుద్దమైన అంశాలను కొనసాగించడం ఈ విషయంలోనూ స్పష్టంగా కనిపిస్తోంది.
కన్వేయెన్స్ డీడ్ల స్థానంలో డీ పట్టాలు..
పేదలకు ఇచ్చే ఇంటిస్ధలాలను ఐదేళ్ల తర్వాత అమ్ముకోవచ్చని, ఇందుకు కన్వేయెన్స్ డీడ్ల రూపంలో ఇస్తామని ప్రభుత్వం గొప్పలు చెప్పింది. అలా ఇవ్వడం కుదరదని, డి-ఫారమ్ పట్టాలే ఇవ్వాలని రెవెన్యూ అధికారులు ఎంత చెప్పినా ప్రభుత్వ పెద్దలు వినలేదు. అనుకున్నదే తడువుగా జీవో 44 ఇచ్చారు. కన్వేయెన్స్ డీడ్లకు చట్టబద్ధత లేదంటూ హైకోర్టు కొట్టివేసింది. కేసు ఇప్పుడు సుప్రీంకోర్టు విచారణ పరిధిలో ఉంది. పేదలకు ఇళ్లపట్టాలు రాష్ట్ర అసైన్మెంట్ చట్టం ప్రకారం ఇస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఇదే విధానం కొన సాగుతోంది. దీనికి భిన్నంగా ఐదేళ్ల తర్వాత అమ్ముకునేలా కన్వేయెన్స్ డీడ్‌లే ఇస్తామని, పేదల పేరిట ఆ భూములు రిజిసే్ట్రషన్ చేస్తామని సర్కారు చెప్పుకుంది. మరోవైపు పేదలకు ఇచ్చే ఇళ్లపట్టాలు 20 ఏళ్లపాటు అమ్ముకోవడానికి వీల్లేదంటూ ఇటీవల ప్రభుత్వమే ఉత్తర్వులు ఇచ్చింది. ఒకవైపు ఐదేళ్ల తర్వాత అమ్ముకునేలా వెసులుబాటు కల్పిస్తామని పేదలకు ఆశ కల్పిస్తూ, మరోవైపు కేసు సుప్రీంకోర్టులో ఉండగానే అసైన్మెంట్ చట్టం ప్రకారం ఇంటిస్ధలాలను 20 ఏళ్లపాటు అమ్ముకోవద్దంటూ ఉత్తర్వులు ఇవ్వడం సర్కారుకే చెల్లింది. ఈ ఒక్క నిబంధనతో ప్రభుత్వం చెప్పిన కన్వేయెన్స్ డీడ్లు చట్టబద్ధమైనవి కావని అంగీకరించినట్లయింది. అంతేకాదు.. అలాంటివి ఇవ్వలేమన్న నిజాన్ని గ్రహించి చివరకు డి-పట్టాల జారీకి అంగీకరించింది.
రీసర్వేలో డ్రోన్లు..
భూముల రీ సర్వేలో డ్రోన్లు ఎందుకు? దేశంలోనే తొలిసారిగా అత్యాధునిక కార్స్ టెక్నాలజీతో భూముల సర్వేచేయబోతున్నామంటూ ప్రభుత్వం గత ఏడాది గొప్పగా చెప్పింది. సర్వే ఆఫ్ ఇండియా డ్రోన్లతో తీసిచ్చే ఫోటోలు మేమేం చేసుకోవాలి? వారికి సర్వేచేసే శక్తిలేదు.. వారికి ఆ శక్తి ఉంటే రూ.500 నుంచి 1000 కోట్లు ఎదురిచ్చి సర్వే చేయించుకుంటామంటూ నాటి మంత్రి, అధికారులు సవాళ్లు విసిరారు. ఏడాది తర్వాత సీన్ కట్‌చేస్తే డ్రోన్ సర్వేకు సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. వ్యవసాయ, ప్రభుత్వ, గ్రామకంఠం భూముల సర్వే బాధ్యతను ఆ సంస్థకు అప్పగించారు. ఇప్పుడు సర్వే ఆఫ్ ఇండియా పనితీరు చాలా గొప్పదని చెబుతున్నారు. అత్యాధునిక, మహాద్భుతం అని ఏపీ సర్కారు సమకూర్చుకున్న కార్స్ టెక్నాలజీలో అనేక లోపాలు ఉన్నాయని బట్టబయలైంది. దీంతో ప్రభుత్వం వెంటనే డ్రోన్ సర్వే పల్లవి అందుకుంది. అవసరమైతే పాత పద్ధతిలో అంటే చైన్, సా్ట్రప్, డీజీపీఎస్, ఈటీఎస్లతో కూడా సర్వేచేస్తామని చెప్పింది.
ఎన్డీబీ టెండర్లలోనూ అదే వరస..
న్యూ డెవలప్మెంట్ బ్యాంకు (ఎన్డీబీ) నుంచి 6,400 కోట్ల రుణం తీసుకుని రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి, విస్తరణ చేపట్టాలని గత ప్రభుత్వ హయాంలోనే నిర్ణయించారు. జగన్ ప్రభుత్వం వచ్చాక నిరుడు సెప్టెంబరులో టెండర్లు పిలిచారు. చిత్తూరు మంత్రి, ఓ ముఖ్యనేత సమీపబంధువు, అధికార పార్టీ ఎమ్మెల్యే, ఇంకా పలువురి పెద్దల కంపెనీలు బిడ్లు వేశాయు. చిత్తూరు మంత్రి చక్రం తిప్పి పెద్దగా పోటీలు పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పత్రికల్లో ఇది రాగానే తప్పులు రాతలంటూ… పరువునష్టం కేసులు పెడతామని బెదిరించారు. కానీ ఆ టెండర్లను రద్దుచేసింది. ఇటీవల మళ్లీ టెండర్లు పూర్తిచేశారు. రివర్స్ టెండర్లు నిర్వహించారు. సేమ్ సీన్, అదే మంత్రి, ఎమ్మెల్యే, ముఖ్యనేత బంధువు కంపెనీలు బిడ్లు దక్కించుకున్నాయి.
విద్యా రంగంలో..
ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఇంటర్ ప్రవేశాలను ఆన్లైన్ ద్వారా జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు కాలేజీల్లో సీట్ల సంఖ్యను తగ్గిస్తూ జీవో 23 జారీ చేసింది. ఇది ఏకపక్ష నిర్ణయంటూ విద్యాసంస్థల సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. ఒక్క ప్రెస్‌నోట్ జారీ చేసి ఆన్లైన్ ప్రవేశాలంటూ కుదరదని సర్కారు నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టింది. పాత పద్ధతిలోనే ప్రవేశాలు చేపట్టాలని ఆదేశించింది. జీవో 23 అమలును నిలిపివేసింది. ఆన్లైన్ ప్రవేశాలపై విద్యాసంస్థలను సంప్రదించి తగిన నిర్ణయం తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని విద్యావేత్తలు చెబుతున్నారు. వృత్తివిద్యాకాలేజీల ఫీజుల విషయంలోనూ సర్కారు వెనక్కి తగ్గింది. ఇంజనీరింగ్, ఫార్మసీ, ఇతర వృత్తివిద్యాకోర్సుల ఫీజులు పెంచుతామంటూ తొలుత హడావుడి చేసింది. చివరకు పాత ఫీజులే కొనసాగిస్తామని వెల్లడించింది. ప్రభుత్వం ఫీజులు ఎందుకు పెంచుతామని చెప్పినట్లు? చివరకు ఎందుకు ఆ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గినట్లు? పైగా, ఇప్పుడున్న ఫీజుల విధానం 2022-23 సంవత్సరం వరకు కొనసాగుతుందని సర్కారు చెప్పడం ఇందులో కొసమెరుపు.