మహిళల రక్షణ కోసం తమ ప్రభుత్వం దిశ చట్టం, యాప్ తీసుకువచ్చిందని వైసీపీ నేతలు గొప్పగా చెప్పుకుంటోన్న సంగతి తెలిసిందే. రెండ్రోజుల క్రితం సీఎం జగన్ కూడా దిశ యాప్ పై కార్యక్రమం నిర్వహించి విపరీతమైన ప్రచారం కల్పించారు. అయితే, ఇప్పటికే టీడీపీ ప్రవేశపెట్టిన పలు పథకాలకు మార్పులు, చేర్పులు చేసి వాటిని తమ పథకాలుగా చెప్పుకుంటోందంటూ టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ కోవలోనే దిశ యాప్ ను కూడా టీడీపీ యాప్ ను కాపీ కొట్టి రూపొందించారని ఆరోపిస్తున్నారు.
‘దిశ యాప్’ పేరుతో హడావిడి చేసిన జగన్ అడ్డంగా దొరికిపోయారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. గత ప్రభుత్వంలో నాటి సీఎం చంద్రబాబు ’ఫోర్త్ లయన్ యాప్’ను అందుబాటులోకి తెచ్చారని, దానిని కాపీ కొట్టి, తానేదో కొత్తగా తెచ్చినట్లు.. చట్టబద్ధత లేని దిశ యాప్ పేరుతో జగన్ ప్రచార ఆర్భాటం చేసుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. ‘ట్రాక్ మై ట్రావెల్’, ఎస్వోఎస్ను ఈ యాప్లో గతంలోనే పొందుపర్చారని గుర్తు చేశారు. టెక్నాలజీని వినియోగించడంలో ముందుండే చంద్రబాబు 2015లోనే ఫోర్త్ లయన్ యాప్ను తెచ్చారని గుర్తు చేశారు.
ఫోర్త్ లయన్ యాప్ ను కాపీ కొట్టి ఓ డ్రామా ఆడే ప్రయత్నం చేశారని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ఎద్దేవా చేశారు. దిశ యాప్ లోని ఫీచర్లన్నీ….మక్కికి మక్కి ఫోర్త్ లయన్ యాప్ నుంచి కాపీ కొట్టినవేనని అన్నారు. చంద్రబాబు మహిళల రక్షణకు తీసుకొచ్చిన ఐ క్లిక్ ఫిర్యాదు వెసులుబాటు, సిటిజన్ యాప్, అభయ యంత్రాలను నిరుపయోగం చేశారని మండిపడ్డారు.