గత కొన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశం అవుతున్న పేరు.. జీవీ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ నుంచి కొన్నేళ్ల ముందు టీడీపీలో చేరిన లాయర్.. వివిధ వేదికల్లో పార్టీ వాయిస్‌ను బలంగా వినిపించారు. సగటు రాజకీయ నాయకుల్లా కేవలం పొలిటికల్ కామెంట్లు, విమర్శలతో సరిపెట్టకుండా.. సబ్జెక్ట్ మీదే మాట్లాడుతూ, గౌరవప్రదమైన భాష వాడుతూ అభిమానులను సంపాదించుకున్నారు. ప్రత్యర్థి పార్టీల వాళ్లు కూడా గౌరవించే శైలి ఆయనది.
పార్టీ కోసం జీవీ రెడ్డి పడ్డ కష్టాన్ని గుర్తించి అధికారంలోకి వచ్చాక ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్‌గా చేశారు చంద్రబాబు. కానీ కొత్త సర్కారు వచ్చాక కూడా గత ప్రభుత్వంలో నియమితులైన వందల మంది తాత్కాలిక ఉద్యోగులు.. ప్రస్తుత ప్రభుత్వ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని ఆరోపిస్తూ వాళ్లందరినీ తొలగించాలని చూశారు జీవీ రెడ్డి. కానీ ఇందుకు సంస్థ, ఐఏఎస్ అధికారి ఎండీ దినేశ్ కుమార్ మీద ఆయన తీవ్ర ఆరోపణలే చేశారు. ఈ వ్యవహారం చినికి చినికి గాలివానలా మారి.. ఇప్పుడు జీవీ రెడ్డి రాజీనామా చేయడం, దినేశ్‌ను బాధ్యతల నుంచి తప్పించడం వరకు వచ్చింది.
ఐతే ఈ వివాదంలో విషయంలో ఒకవైపు జీవీ రెడ్డి రాజీనామాను ఆమోదిస్తూ.. మరోవైపు దినేశ్ కుమార్‌ను బాధ్యతల నుంచి తప్పించి జీఏడీకి రిపోర్ట్ చేయమనడం ద్వారా బాబు ప్రభుత్వం బ్యాలెన్సింగ్ యాక్ట్ కోసం ప్రయత్నించినట్లు కనిపిస్తోంది. కానీ టీడీపీ కార్యకర్తలు మాత్రం.. పార్టీ జీవీ రెడ్డి లాంటి మంచి నాయకుడిని కోల్పోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ వ్యవహారంలో క్యాడర్ నుంచి ప్రభుత్వ పెద్దలకు అసలు ఏమాత్రం సపోర్ట్ లేకపోవడం గమనార్హం. జీవీ రెడ్డి చిన్న స్థాయి నేతే కదా, అలాంటి వ్యక్తిని బుజ్జగించడం ఏంటి.. అలా చేస్తే ఇప్పటికే జీవీ రెడ్డి ఆరోపణలు, వ్యాఖ్యల విషయంలో తీవ్ర ఆగ్రహంతో ఉణ్న అధికారుల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని అని బాబు అండ్ కో అనుకుని ఉండొచ్చేమో.
కానీ టీడీపీ క్యాడర్ ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలేరా లేరు. జీవీ రెడ్డికి కార్యకర్తల నుంచి అనూహ్యమైన మద్దతు లభిస్తోంది. ఈ వ్యవహారాన్ని వాళ్లు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. జీవీ రెడ్డిని పార్టీ కోసం కష్టపడ్డ వాళ్లందరి ప్రతినిధి లాగా చూస్తున్నారు కార్యకర్తలు. దీంతో చంద్రబాబు, లోకేష్‌ల విషయంలో ఏమాత్రం సానుకూల ధోరణి ప్రదర్శించట్లేదు. జీవీ రెడ్డితో వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు. జీవీ రెడ్డి మీద కార్యకర్తల్లో ఇంత అభిమానం ఉందని.. ఆయన్ని పార్టీ దూరం చేసుకుంటే ఈ స్థాయిలో వ్యతిరేకత వస్తుందని బాబు అండ్ కో కూడా ఊహించి ఉండరేమో.
చంద్రబాబు పాత కాల రాజకీయాలు చేస్తున్నారని.. లోకేష్ అయినా ఈ వ్యవహారంలో ముందడుగు వేసి జీవీ రెడ్డిని తిరిగి పార్టీలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదాన్ని పరిష్కరించడం లోకేష్ నాయకత్వ పటిమకు ఓ పరీక్ష అని కూడా అంటున్నారు. ఈ స్పందన చూశాక జీవీ రెడ్డిని బుజ్జగించి తిరిగి పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతాయేమో చూడాలి.