టాలీవుడ్ దర్శకుడు త్రినాధరావు మక్కెన తరచూ తన వ్యాఖ్యలతో వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్న వైనం తెలిసిందే. టాలీవుడ్ నటి అన్షు కాస్త తిని ఒళ్లు పెంచాలని, తెలుగు వాళ్లకు అన్నీ కొంచెం లావుగా కావాలని ఆయన చేసిన కామెంట్లు వివాదాస్పదమయ్యాయి. ఈ క్రమంలోనే ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా తన వ్యాఖ్యలపై త్రినాధ రావు క్షమాపణలు చెప్పారు.
తన వ్యాఖ్యల వల్ల బాధపడిన అన్షుకు, మహిళలందరికీ తాను క్షమాపణ చెబుతున్నానని ఆయన అన్నారు. అయితే, ఎవరినీ బాధపెట్టాలన్నది తన ఉద్దేశం కాదని అన్నారు. అయితే, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పేనని, అందరూ పెద్ద మనసు చేసుకొని తనను క్షమించాలని వేడుకున్నారు. సందీప్ కిషన్ హీరోగా ఆయన దర్శకత్వం వహించిన ‘మజాకా’ టీజర్ లాంచ్ ఈవెంట్లో అన్షుపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది.
ఇక, ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ పేరు… అంటూ కాసేపు మరిచిపోయినట్లుగా ఆయన నటించారు. తాగడానికి నీళ్లు కావాలి అంటూ పుష్ప-2 సక్సెస్ మీట్ లో హీరో అల్లు అర్జున్ ను ఇమిటేట్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో, త్రినాధ రావు ను సోషల్ మీడియాలో నెటిజన్లు ఏకిపారేశారు.