‘పెళ్ళిచూపులు’ సినిమాతో టాలీవుడ్లో ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు తరుణ్ భాస్కర్. తన రెండో చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది’ రిలీజ్ టైంలో థియేటర్లలో అనుకున్నంతగా ఆడలేదు కానీ.. ఓటీటీలో, టీవీల్లో ఈ సినిమాను జనం బాగానే చూశారు. గత ఏడాది ఈ మూవీని రీ రిలీజ్ చేస్తే తెలుగు ప్రేక్షకులు మామూలుగా సెలబ్రేట్ చేయలేదు.
దీనికి వాళ్లు కల్ట్ స్టేటస్ తీసుకొచ్చారనే చెప్పాలి. ఇప్పుడు తరుణ్ ఈ చిత్రానికి సీక్వెల్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లుగా ఈ మధ్య వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటిదాకా అధికారికంగా దాని గురించి ఏ సమాచారం లేదు. ఐతే లేటెస్ట్గా తరుణ్ భాస్కర్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు చూస్తే అతి త్వరలోనే ‘ఈ నగరానికి ఏమైంది-2’ సెట్స్ మీదికి వెళ్లబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
‘‘ఈ సంవత్సరం కొన్ని బాకీలు తీర్చాలే’’ అన్న కామెంట్‌కు తోడు ‘ఈ నగరానికి ఏమైంది’లో విశ్వక్సేన్ పెట్టుకున్న తరహా గాగుల్స్‌తో తరుణ్ పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ గురించి హింట్ ఇస్తున్న పోస్టే అని అందరికీ అర్థమైపోయింది. దీంతో నెటిజన్లు ఈ సినిమా విషయంలో చాలా ఎగ్జైట్ అవుతున్నారు.
ఇప్పుడు తేలాల్సిందల్లా విశ్వక్సేనే మళ్లీ ఇందులోనూ లీడ్ రోల్ చేస్తాడా.. అందులో కనిపించిన గ్యాంగ్ అంతా ఇక్కడా రిపీట్ అవుతుందా అనే. ‘ఈ నగరానికి ఏమైంది’ చేసేటప్పటికి విశ్వక్ కెరీర్లో తొలి అడుగులు వేస్తున్నాడు. ఇప్పుడు స్టార్ అయ్యాడు. అయినా ఈ క్రేజీ మూవీ సీక్వెల్లో నటించడానికి అతడికి పెద్దగా అభ్యంతరాలు లేకపోవచ్చు. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థే ఈ మూవీని కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశాలున్నాయి.