డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడిగా ఆకాష్ పూరీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆకాష్.. 2015లో ఆంధ్ర పోరి మూవీతో హీరోగా మారాడు. ఆ తర్వాత మెహబూబా, రొమాంటిక్, చోర్ బజార్ వంటి సినిమాలతో అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. కానీ ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.
2022 తర్వాత ఆకాష్ నుంచి మరొక సినిమా రాలేదు. తండ్రి స్టార్ డైరెక్టర్ అయినప్పటికీ ఆకాష్ కెరీర్ మాత్రం అంతంత మాత్రంగానే సాగుతోంది. ఇక ఇలాంటి తరుణంలో ఆకాష్ తాజాగా తన పేరును మార్చుకున్నాడు. నేడు ఆకాష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా పేరు మార్చుకున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అతను అనౌన్స్ చేశాడు.
`నా పేరులో మార్పు జరిగింది ఇకపై నా పేరు ఆకాష్ పూరీ కాదు.. ఇప్పటినుంచి నేను ఆకాష్ జగన్నాథ్` అని ఇంస్టాగ్రామ్ ద్వారా ప్రకటించాడు. అయితే ఆకాష్ పేరు మార్చుకున్న విషయాన్ని తెలిపాడుగానీ.. అందుకు గల కారణం ఏంటి అన్నది మాత్రం వెల్లడించలేదు. కెరీర్ పరంగా కలిసిరావడానికే ఆకాష్ తన పేరును మార్చుకున్నాడని అభిమానులు మరియు సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు.