మహేష్ బాబు కొత్త సినిమా సర్కారు వారి పాటకు డివైడ్ టాక్ రావడం తెలిసిందే. ఇందులో హీరో హీరోయిన్ల క్యారెక్టరైజేషన్, ఇద్దరి మధ్య వచ్చే కొన్ని సన్నివేశాల విషయంలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కొన్ని సన్నివేశాల్లో లాజిక్ ఏంటో కూడా అర్థం కాలేదు. ఉదాహరణకు వడ్డీ వ్యాపారి అయిన హీరో.. హీరోయిన్‌కు అప్పుగా ఇచ్చేది పది వేల డాలర్లే అయినా, తర్వాత ఆమె అడిగిందని ఇంకో పాతిక వేల డాలర్లు ఇస్తాడు. ఇది కాక హీరోకు తెలిసీ తెలియకుండా హీరోయిన్ చాలా డబ్బులు లాగేస్తుంది. కానీ హీరో మాత్రం హీరోయిన్‌కు తాను మొదటగా ఇచ్చిన పది వేల డాలర్ల అప్పు కోసమే ఇండియాకు వస్తాడు. ఎంతసేపూ పది వేల డాలర్ల ప్రస్తావనే తెస్తుంటాడు. హీరోయిన్‌కు తర్వాత చాలా ఇచ్చి కేవలం ఈ పది వేల డాలర్ల అప్పే అడగడం ఏంటన్నది ప్రేక్షకుల సందేహం.
మరోవైపు సినిమాలో కొన్ని డైలాగులు, అలాగే హీరో హీరోయిన్ మీద కాలేసుకుని పడుకునే సన్నివేశాలు అసభ్యంగా ఉన్నాయనే విమర్శలు కూడా వచ్చాయి. ఈ సందేహాలకు, విమర్శలకు దర్శకుడు పరశురామ్ సమాధానం ఇచ్చాడు. దీనిపై అతను మీడియాతో మాట్లాడాడు. ముందుగా డబ్బుల సంగతి వివరిస్తూ.. హీరో ముందు అప్పుగా ఇచ్చేది పది వేల డాలర్లు అని, మిగతా డబ్బంతా ప్రేమలో ఉండగా ఇష్టంతో ఇస్తాడు కాబట్టి దాన్ని అప్పుగా భావించడని చెప్పాడు పరశురామ్. ఐతే హీరోయిన్ తనను మోసం చేసిందని తెలిశాక ఇక ప్రేమ ఎక్కడుంటుందన్నది ఇక్కడ లాజిక్.
హీరోయిన్ మీద హీరో కాలేసుకుని పడుకునే సన్నివేశాల గురించి పరశురామ్ స్పందిస్తూ.. ఆ సీన్లలో ఎక్కడా వల్గారిటీ లేదని, వల్గారిటీ వుంటే మహేషే వద్దని చెప్పేవాడని అన్నాడు. తల్లి దగ్గర నిద్రపోయే ఒక బిడ్డలా ఆ సీన్స్ ఉంటాయి తప్పితే అందులో వల్గారిటీ లేదని పరశురామ్ చెప్పడం గమనార్హం. కానీ ప్రేక్షకులకైతే అలాంటి ఫీలింగేమీ కలగదు. అయినా హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్ చూస్తారు కానీ.. తల్లి దగ్గర బిడ్డ నిద్రపోయే కోణంలో ఈ సన్నివేశాన్ని ప్రేక్షకులెలా చూస్తారో పరశురామ్‌కే తెలియాలి.