లోకేష్ కనకరాజ్.. ఇప్పుడు ఇండియా మొత్తంలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడు. ‘ఖైదీ‘, ‘విక్రమ్’ సినిమాలతో అతను రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. అందులోనూ కెరీర్ ముగిసందనుకున్న కమల్ హాసన్‌ను పెట్టి అతను తీసిన ‘విక్రమ్’ తమిళనాట కలెక్షన్ల రికార్డులు చాలానే బద్దలు కొట్టింది. ఇతర భాషల్లోనూ ఘనవిజయాన్నందుకుంది. తాను అప్పటికే తీసిన మానగరం, ఖైదీ, మాస్టర్ చిత్రాలతో లింకు పెడుతూ ఇందులో ఒక మల్టీవెర్స్ క్రియేట్ చేయడం లోకేష్ ప్రత్యేకతను చాటిచెప్పింది.
కథ పరంగానే కాక పాత్రల విషయంలోనూ లోకేష్ ఇప్పటిదాకా తీసిన నాలుగు చిత్రాల్లోనూ కనెక్షన్ కనిపిస్తుంది. ఇకముందు ఈ మల్టీవెర్స్ను మరింత పెద్ద స్థాయికి తీసుకెళ్లబోతున్నాడు లోకేష్. అతడి తర్వాతి చిత్రం విజయ్‌తో కాగా.. దానికీ గత చిత్రాలకూ కనెక్షన్ ఉంటుందట.
ఆ తర్వాత ఖైదీ-2, విక్రమ్-2 సినిమాలు లైన్లో ఉన్నాయి. అలాగే ‘విక్రమ్’లో సూర్య చేసిన విలన్ పాత్ర రోలెక్స్ మీదా ప్రత్యేకంగా ఓ సినిమా ఉంటుందని లోకేష్ వెల్లడించాడు. ఈ సినిమాలన్నింటినీ కలిపితే వచ్చే పదేళ్లకు తన షెడ్యూల్ ఫిక్సయిపోయినట్లుగా ఓ ఇంటర్వ్యూలో లోకేష్ తెలపడం విశేషం. ‘‘విజయ్ సార్‌తో సినిమా పూర్తయ్యాక కమల్ సార్‌తో కూర్చుని మాట్లాడతా. ఆ తర్వాత ‘ఖైదీ-2’ పనులు మొదలుపెడతా.
అది పూర్తయిన వెంటనే ‘విక్రమ్’ సీక్వెల్ ఉంటుంది. అంతే కాక రోలెక్స్ పాత్ర నేపథ్యంలో ఓ సినిమా ఉంటుంది. ఐతే ఇదొక మల్టీవర్స్ కాబట్టి ఏ సినిమా ఎప్పుడు వస్తుందో చెప్పలేను. అది ప్రీక్వెల్ కావచ్చు.. సీక్వెల్ కావచ్చు. వచ్చే పదేళ్ల వరకు అయితే నేను సెటిల్’’ అని లోకేష్ వ్యాఖ్యానించాడు. విజయ్ హీరోగా లోకేష్ రూపొందించనున్న చిత్రంలో హీరోయిన్గా త్రిష నటిస్తుందని తెలుస్తోంది. ఈ నెలలోనే సినిమా సెట్స్ మీదికి వెళ్లే అవకాశముంది.