జ్యోతికృష్ణ.. ఈ పేరును తెలుగు ప్రేక్షకులు అంత సులువుగా మరిచిపోలేరు. లెజెండరీ ప్రొడ్యూసర్ ఎ.ఎం.రత్నం తనయుడైన ఇతను.. తండ్రిలా నిర్మాత కాలేదు. తమ్ముడు రవికృష్ణలా నటుడూ కాలేదు. దర్శకుడు గా పరిచయం అయ్యాడీ నిర్మాత కొడుకు. అతడి తొలి చిత్రం ‘నీ మనసు నాకు తెలుసు’కు అప్పట్లో మంచి హైప్ వచ్చింది. తరుణ్, త్రిష, శ్రియ లాంటి స్టార్ కాస్టింగ్‌తో పెద్ద బడ్జెట్లో ఈ సినిమాను నిర్మించాడు రత్నం. కానీ విడుదలకు ముందు మంచ హైప్ తెచ్చుకున్న ఆ సినిమా పెద్ద డిజాస్టర్ అయింది.
రత్నం నిర్మాతగా మంచి ఫాంలో ఉన్న టైంలో ఇది ఆయనకు పెద్ద షాక్. అయినా పుత్ర వాత్సల్యంతో తర్వాత కూడా కొడుకు దర్శకత్వంలో ‘కేడి’ అనే ఓ సినిమా తీశాడు. ఇందులో జ్యోతికృష్ణ తమ్ముడు రవికృష్ణ హీరో. ఈ సినిమా అసలు విడుదలకే నోచుకోలేకపోయింది. మళ్లీ రత్నంకు భారీ నష్టం తప్పలేదు. తర్వాత చాలా గ్యాప్ తీసుకుని తెలుగులో గోపీచంద్‌ను హీరోగా పెట్టి ‘ఆక్సిజన్’ అనే సినిమా తీశాడు. ఇది చాలా ఏళ్లు వాయిదాల మీద వాయిదాలు పడి చివరికి 2017లో విడుదలైంది. కానీ ఫలితం మాత్రం మారలేదు.
ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తూ కొంత పెట్టుబడి పెట్టిన రత్నంకు మళ్లీ కష్టాలు తప్పలేదు. జ్యోతికృష్ణ కెరీర్లో మళ్లీ గ్యాప్ తప్పలేదు. ఇంత కాలానికి అతను ‘రూల్స్ రంజన్’ అనే కామెడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు కూడా రత్నమే ప్రెజెంటర్. అసలే కిరణ్ అబ్బవరం కెరీర్ బాగా ఇబ్బందుల్లో ఉంది. ఇంకో ఫ్లాప్ పడితే తట్టుకునే స్థితిలో అతను లేడు. కానీ ‘రూల్స్ రంజన్’తో అతడి కెరీర్లో అత్యంత వరస్ట్ మూవీని అందించాడు జ్యోతికృష్ణ. ఈ సినిమాకు అతను ‘రత్నం కృష్ణ’ అని తండ్రి పేరు కలిసొచ్చేలా పేరు మార్చుకున్నాడు.
కానీ దర్శకుడిగా అతడి పనితనం మాత్రం ఇంకా దారుణంగా తయారైంది. ‘రూల్స్ రంజన్’ చూశాక సినిమా తీయడంలో దర్శకుడిగా మినిమం బేసిక్స్ కూడా తెలియవా అని ఆశ్చర్యం కలుగుతుంది. ఈ సినిమాతో నిర్మాతల్ని, హీరోను ఇంకా పెద్ద దెబ్బ కొట్టాడు రత్నంకృష్ణ. ఇక తన కెరీర్ గురించి చెప్పేదేమీ లేదు. అతనింక సినిమాలు మానేసి సైలెంటుగా ఉంటే అందరికీ మంచిదనే కామెంట్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.