ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ సక్సెస్ ఫుల్ మెగా డైరెక్టర్లలో అట్లీ ఒకడు. అతను ఇప్పటిదాకా తీసిన సినిమాలేమీ కళాఖండాలు కావు. అవి కొత్తగా ఏమీ అనిపించవు. కానీ మాస్ ప్రేక్షకులను, స్టార్ హీరోల అభిమానులను అలరిస్తూ అన్నీబ్లాక్బస్టర్లు అయ్యాయి. చివరగా అతను గత ఏడాది షారుఖ్ ఖాన్‌తో తీసిన ‘జవాన్’ వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. దీని తర్వాత టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్‌తో అట్లీ ఓ సినిమా చేస్తాడని వార్తలొచ్చాయి.
ఈ చిత్రానికి అన్నీ సిద్ధమైనట్లే కనిపించింది. కానీ చివర్లో ఏదో తేడా కొట్టి ఈ చిత్రం క్యాన్సిల్ అయింది. అట్లీ రూ.80 కోట్ల పారితోషకం అడగడంతో ఈ ప్రాజెక్ట్ వర్కవుట్ కాదని నిర్మాతల్లో ఒకరైన అల్లు అరవింద్ వెనక్కి తగ్గినట్లు వార్తలొచ్చాయి. కారణాలేవైనా కానీ.. ఈ సినిమా క్యాన్సిల్ అయిందన్నది మాత్రం వాస్తవం.
కాగా బన్నీతో ఛాన్స్ మిస్ అయిందని అట్లీ ఏమీ నిరాశచెందలేదు. తన తర్వాతి చిత్రాన్ని ఇంకా పెద్ద స్థాయికి తీసుకెళ్లడానికి అతను సన్నాహాలు చేస్తున్నాడన్నది లేటెస్ట్ సమాచారం. ఏకంగా ఇద్దరు సూపర్ స్టార్లను కలిపి సినిమా చేయబోతున్నాడట.
అందులో ఒకరు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కాగా.. మరొకరు బాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడైన సల్మాన్ ఖాన్. వీళ్లిద్దరి కలయికలో సినిమా కోసం అట్లీ ఒక లైన్ రెడీ చేసి.. ఇద్దరితో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఈ ఇద్దరు హీరోలూ మాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. అట్లీ సినిమాలు కూడా వారి శైలికి తగ్గట్లే ఉంటాయి. ఈ ఇద్దరినీ కలిసి సినిమా తీస్తే.. నార్త్, సౌత్ అని తేడా లేకుండా అన్ని చోట్లా బాక్సాఫీస్‌ను షేక్ చేయొచ్చు. అట్లీ ట్రాక్ రికార్డును బట్టి ఈ హీరోలు సినిమా చేయడానికి ముందుకొచ్చే అవకాశాలే ఉన్నాయి కాబట్టి ఈ మెగా కాంబో కార్యరూపం దాల్చే అవకాశాలే ఎక్కువ.