ఈ మధ్య కాలంలో చిన్న సినిమాల్లో పెద్ద విజయం అంటే ‘బలగం’దే. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్లో కమెడియన్ వేణు రూపొందించిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్ని అందుకుంది. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం.. మౌత్ టాక్‌తోనే జనాల్లోకి వెళ్లింది. ‘బలగం’ చూసిన వాళ్లు ఒకరికొకరు చెప్పి సినిమా చూపించడంతో వసూళ్లు అనూహ్యంగా పెరిగాయి. నైజాంలో అయితే రెండు, మూడు వారాల్లో కూడా హౌస్ ఫుల్ వసూళ్లలో సినిమా ఆడింది.
ఐతే ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం విడుదలైన మూడు వారాలకే ఈ చిత్రాన్ని అమేజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేసేశారు. అప్పటికి థియేటర్లలో సినిమా బాగా ఆడుతున్నప్పటికీ.. కాంట్రాక్ట్ మేరకు ప్రైమ్ వాళ్లు సినిమాను స్ట్రీమ్ చేసేశారు. అమేజాన్‌లో రిలీజయ్యాక ‘బలగం’ ఇంకో లెవెల్‌కు వెళ్లిపోయింది. ఈ సినిమా గురించి మరోసారి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది.
‘బలగం’ సినిమాను విపరీతంగా మెచ్చిన గ్రామీణ జనాలు.. ఓపెన్ ప్లేసుల్లో తెరలు కట్టి సినిమాను ప్రదర్శించారు. తెలంగాణ గ్రామాల్లో ఇదొక ట్రెండుగా మారిపోయింది. ఊర్లలో జనాలంతా వచ్చి ఈ సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఐతే ఈ షోల విషయంలో ఇప్పుడు వివాదం నెలకొంది. ఓటీటీ ద్వారా రిలీజైన సినిమాను ఇలా ప్రదర్శించడం చట్ట విరుద్ధం. ఐతే అమేజాన్ ప్రైమ్ వాళ్లయితే దీని మీద ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. కానీ నిర్మాత దిల్ రాజు మాత్రం తమ అనుమతి లేకుండా సినిమాను గ్రామాల్లో ప్రదర్శిస్తున్నారని.. వీటిని అడ్డుకోవాలని పోలీసుల అధికారులకు లేఖ రాయడం చర్చనీయాంశం అయింది. దిల్ రాజు నిబంధనల ప్రకారమే ఇలా అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ.. ఓటీటీలో రిలీజ్ కావడం వల్ల ఆల్రెడీ థియేట్రికల్ రన్ ముగిసిన నేపథ్యంలో ఈ విషయాన్ని పట్టించుకోకుండా వదిలేయాల్సిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇక కొత్తగా తనకు ఆదాయం వచ్చేదేమీ లేదు కాబట్టి.. తన సినిమాను ఇలా గ్రామాల్లో ప్రదర్శించుకుని సెలబ్రేట్ చేసుకోవడాన్ని ఒక ప్రైడ్‌గా తీసుకోవాల్సిందని.. ఇలాంటి గౌరవం అన్ని సినిమాలకూ దక్కదు కాబట్టి దాన్నో రికార్డుగా పరిగణించి విడిచిపెట్టాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.