సినిమా టికెట్ ధరల వ్యవహారం ఇపుడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఏపీ సర్కార్ పై హీరో నాని చేసిన వ్యాఖ్యలు కాక రేపాయి. ఈ క్రమంలోనే నానిపై మంత్రులు విరుచుకుపడుతుండగా…ఇండస్ట్రీ నుంచి కూడా నానికి మద్దతు వస్తోంది. తాజాగా నాని చేసిన కామెంట్లపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పందించారు. నాని వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని దిల్ రాజు అన్నారు.
తన సినిమా రిలీజ్ సందర్భంగా నాని ఎమోషన్ లో మాట్లాడాడని క్లారిటీ ఇచ్చారు. నాని గత రెండు సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయని, ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యే సమయానికి ఇలా టికెట్ల రేట్ల వ్యవహారం నడుస్తుండడంతో నాని కొంత ఆవేదనతో మాట్లాడాడని అన్నారు. దయచేసి నాని చేసిన వ్యాఖ్యలను ఎవరూ తప్పుగా అర్థం చేసుకోవద్దని దిల్ రాజు కోరారు. నాని చెప్పిన విషయం ఒకటైతే… జనాల్లోకి వెళ్లింది మరొకటని ఆయన అన్నారు.
నాని చెప్పిన మాటల వెనుక ఉన్న ఆంతర్యాన్ని అర్ధం చేసుకురనేంత తీరిక, ఓపిక చాలామందికి లేదని అన్నారు. సినిమాలకు , ప్రేక్షకులకు , ప్రభుత్వానికి మధ్య ఉన్న గోడ మీడియా అని, మీరు ఏది చూపిస్తే అదే ప్రేక్షకులకు చూస్తారని మీడియానుద్దేశించి షాకింగ్ కామెంట్లు చేశారు. మీడియా చూపించే హెడ్ లైన్స్ చాలా ప్రభావం చూపుతాయని, లోపల ఉన్న మ్యాటర్ చదివే పాఠకులు చాలా తక్కువ మందని అన్నారు.
ఇపుడు కూడా తాను మాట్లాడే ప్రతి మాట కూడా ఆలోచించి మాట్లాడాలని, ఎమోషన్ లో మాట్లాడితే బ్యాలెన్స్ కోల్పోతామని, అపుడు మాటలపై కంట్రోల్ ఉండదని చెప్పారు. ‘శ్యామ్ సింగరాయ్’ చిత్ర సక్సెస్ మీట్ కి అతిధిగా విచ్చేసిన దిల్ రాజు ఈ విషయంపై చేసిన వ్యాఖ్యలు ఇపుడు హాట్ టాపిక్ గా మారాయి. అయితే, తాను చెప్పాల్సింది ఇంకా ఉందని, తాను నిర్వహించబోయే ప్రెస్ మీట్లో మిగతా వివరాలు చెబుతానని అన్నారు.